Tuesday, 21 November 2017

ఉత్తర తెలంగాణ లో పెట్రోలియం ఉత్పత్తులు నిలవ చేయుటకు తీసుకున్న చర్యలు

2014 జూన్ రెండవ పక్షంలో ఉత్తర తెలంగాణలో చమురు ఉత్పత్తుల కొరత ఏర్పడింది. దీనికి కారణం కొండపల్లి, విజయవాడ నుంచి డీజిల్, పెట్రోల్ సరఫరా ఆగి పోవటం. అందువల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికీ రామగుండం నుంచి సరఫరా చేయవలసి వచ్చింది. దీంతో రామగుండం డిపో పంపాల్సిన దుకాణాలు 200 నుంచి 340కి  పెరిగాయి.

పౌర సరఫరాల శాఖ కమీషనర్ ఈ విషయాన్ని చమురు సంస్థలతో చర్చించారు. తెలంగాణా రాష్ట్రంలో చమురు ఉత్పత్తుల కొరత లేకుండా చేయమని సూచించారు. చమురు సంగ్రాహకులు  ఎంత నిల్వలు ఉన్నాయి, చమురు సంస్థలు, డిపోలు, చిల్లర (రిటైల్ )దుకాణాలలో సమస్యలను సమీక్షించి, పౌర సరఫరాల కమీషనర్ కు వెంటనే నివేదిక ఇవ్వమన్నారు. ప్రధాన కార్యదర్శి కూడా ఈ విషయంలో కలగ జేసుకున్నారు. రామగుండం డిపో ఈ పెను భారాన్ని తట్టుకోలేదని, ఇతర డిపోల నుంచి చమురు ఉత్పత్తులను తెచ్చి డిమాండ్ - సప్లై మధ్య అంతరాన్ని తగ్గించమని చమురు సంస్థలకు సూచించారు. వరంగల్- రామగుండము- చెర్లపల్లి మధ్య సరఫరా వాహనాలకు  (రేకులు) విరివిగా తిరిగేందుకు అనుమతి ఇవ్వమని దక్షిణ మధ్య రైల్వే జి. ఎం. ను  కోరారు. అదే విధంగా ఈ వాహనాలకు ప్రయాణ సమయం తగ్గించేందుకు వీలుగా దక్షిణ, నైరుతి రైల్వే అధికారులతో సమన్వయము చేసుకోమని, ఈ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలుగ కుండా ఉండేందుకు గాను ఒకే గమ్యానికి చేరే వాహనాలను రెండు కంటే ఎక్కువ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.  

ఇంకా, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ మరియు చమురు సంస్థల మధ్య లావాదేవీలకు సమయాన్ని వీలైనంత తగ్గించాల్సిందిగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ ను కోరారు. తెలంగాణా రాష్ట్రానికి త్వరిత గతిన చమురును అందించటానికి విశాఖపట్నం పోర్ట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న ఆయిల్ టాంకర్ లను రామగుండము చెర్లపల్లి వంటి ప్రదేశాలకు వెంటనే పంపమని కోరారు.   

గౌ. వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు పౌర సరఫరాల మంత్రిగారు చమురు సంస్థల ప్రతినిధులతో సమావేశమై వారికీ చర్యలను తీసుకోమని సూచించారు :
…. చమురు సంస్థలు  రామగుండం ఐ. ఓ. సి. డిపో వద్ద ట్రక్కుల్లో చమురు ఉత్పత్తులను లోడింగ్ చేసేందుకు రెండు షిఫ్టులలో పని చేయాలి.  
…. చమురు సంస్థలు వరంగల్, సూర్యాపేట, రామగుండము(హెచ్. పీ. ఎస్.) ల మధ్య సర్దుబాటు చేసుకొని పూర్తి డిమాండును సత్వరమే ఎదుర్కోవాలి.  దూరంగా ఉన్న జిల్లాలకు రవాణా సమయం తగ్గించటానికి ఇది అవసరం.

…. డిపో రెండు షిఫ్టులలో పని చేయాలి, దీని వల్ల సరుకు అందుకోవటం, సరఫరాలో లోపాలు నివారించబడతాయి.
తెలంగాణా రాష్ట్రంలో దీర్ఘ కాలిక ప్రణాళిక చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వ్యాఖ్యానించారు.  చమురు సంస్థలు కూడా ఎక్కువ సంఖ్యలో ఆయిల్ డిపోలను ఏర్పాటు చేయాలని, అవసర మనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వారికి తగు విధంగా సహాయం చేస్తుందని  తెలియజేశారు.

లభ్యత సరఫరాల పరిస్థితి చమురు సంస్థలతో క్రమంగా తెలుసుకుంటూ ఉన్నారు.  

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఉత్తమ కృషి వలన చమురు ఉత్పత్తుల (డీజిల్, పెట్రోల్) సరఫరా రామగుండం డిపోలో మెరుగు పడింది. తెలంగాణా రాష్ట్రంలో వీటి కొరత అదుపు లోకి వచ్చింది .


మోహిత

7 సెప్టెంబర్ 2014


పొట్ట తగ్గించుకోండి ఇలా ..


హెల్త్ ఎక్స్ పర్ట్ సలహా ప్రకారం జిమ్ కి వెళ్ళడం వల్ల పొట్ట తగ్గదు. అయితే జిమ్ కి వెళ్ళినప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనే వివరం తెలిసుండాలి..


పొట్ట తగ్గించుకోవటానికి అన్నిటికంటే పెద్ద ఆటంకం ఎలా చేయాలో తెలియకపోవటమే. మీరు ఒక చిన్న విషయం పరీక్షించండి.  దగ్గరలో ఏదైనా జిమ్ ఉంటే వెళ్లి చూడండి. అక్కడ లావాటి మహిళలు నేల లేదా మెషిన్ మీద పడుకొని ఎన్నో రకాలైన క్రంచెస్ (క్రంచెస్ అంటే సాధారణంగా మోకాళ్ళను ముక్కు దగ్గరకు, లేదా ముక్కును పొట్ట దగ్గరకు తీసుకు వెళ్ళే వ్యాయామాలు) చేస్తూ కనిపిస్తారు. ఇది చాలా ప్రసిద్ధ వ్యాయామం.


ఈ వ్యాయామాన్ని ఒకటి రెండు నెలలు నిలకడగా చేయటం వల్ల నడుము కొలతలో కొన్ని సెంటీమీటర్ల తగ్గుదల, పొట్ట తేలిక అవ్వటం వంటి ఫలితాలు ఉంటాయి. అయితే, మేడంగారూ, జాగ్రత్తగా గమనించండి - క్రంచెస్ చేయటం వల్ల కేవలం పొట్ట తేలిక అవుతుంది అంతే. ఈ వ్యాయామం పొట్ట చదునుగా ఉన్నవారికి, ఆబ్స్  చేసేవారికి పనికి వస్తుంది. లావుగా ఉంటే కనుక క్రంచెస్ ఒకటే కాదు, ఫుల్ బాడీ ఎక్సర్ సైజు చేయాల్సి ఉంటుంది. మీకు నమ్మకం కుదరకపోతే ఎవరైనా మంచిపేరు గల హెల్త్ ప్రొఫెషనల్ ని అడిగి నిర్ధారించుకోండి. క్రంచెస్ చేయటం వల్ల అసలు ఉపయోగం ఏమి లేదని మేము చెప్పటం లేదు, అయితే లావాటి శరీరం గల వారికి మొత్తం వ్యాయామంలో  క్రంచెస్ కేవలం పది శాతమే ఉంటేనే మంచిది.


పొట్ట తగ్గించుకునే వ్యాయామాలు కొన్ని
పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, పీటీ, క్రాస్ ట్రెయినర్, బర్పీ, స్క్వాట్ త్రస్ట్, బాక్స్ జంప్, తాడాట, కెటిల్ బెల్, డంబెల్ స్వింగ్ - ఇవన్నీ పొట్ట తగ్గించేవే. మీకు ఇంటర్నెట్ సౌలభ్యం ఉన్నట్టైతే వీటిలో తెలియనివాటి గురించి ఇక్కడ ఇచ్చిన పేర్లతోనే సెర్చ్ చేసి బొమ్మలు చూస్తే మీకే అర్థమైపోతుంది వాటిని ఎలా చేయాలో.


పొట్ట తప్పకుండా తగ్గుతుంది
మీరు జిమ్ కి గాని పార్కుకి గాని వెళ్ళండి. మీ శరీరంలో దాదాపు అన్ని భాగాలు పని చేసేటువంటి వ్యాయామాలు ఎంచుకోండి. ఒక విషయాన్ని మాత్రం చాల జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సుమా. అదేంటంటే స్పాట్ రిడక్షన్ లాంటిది - అంటే కేవలం ఒకే భాగం కరిగేలా వ్యాయామం ఉండదు. కేవలం నడుము అంటే నడుమే, పొట్ట అంటే పొట్టే తగ్గే వ్యాయామాలు చేయించటం చేయటం ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ కి మాత్రమే సాధ్యం అని తెలుసుకోండి.


పొట్ట గురించి ఆలోచించటం మానేసి బరువు గురించి ఆలోచించండి. బరువు తగ్గడం కోసం కార్డియో ( పరుగు, పీటీ లాంటివి) తో పాటు వెయిట్ ట్రైనింగ్ కూడా అవసరం. జ్ఞానవంతంగా వ్యవహరిస్తే సమయం, డబ్బు రెండూ వ్యర్థం కాకుండా ఆదా చేసిన వారవుతారు. మీకు గనక సమయం ఎక్కువ ఉంది, అది గడవటం లేదు అనుకుంటే ఫరవాలేదు కానీ తొందరగా పొట్ట తగ్గాలంటే మాత్రం మీ వ్యాయామ క్రమంలో స్ట్రెచెస్ ను వీలైనంత తక్కువ చేయండి. ఎందుకంటే వీటి వల్ల మీకు ఏ ఉపయోగమూ ఉండదు. అవసరాన్ని మించి కార్డియో చేయటం వల్ల కాళ్ళ కండరాలు బలహీన పడతాయి. ప్రతిరోజూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. తేలిక పాటి వ్యాయామాలు బరువును తగ్గించలేవు. మీరు ఇరవై నిముషాల కార్డియో చేయండి, దాని తరువాత వెయిట్ ట్రైనింగ్, తరువాత చిన్న చిన్న  స్ట్రెచెస్ చేసి హాయిగా ఇంటికి వెళ్ళండి. అప్పుడప్పుడు కార్డియో కూడా చేయకండి. ఒట్టి వామప్, హెవీ వెయిట్ ట్రైనింగ్ చేయండి. కొన్నిసార్లు జిమ్ కి వెళ్ళటం కుడా మానేసి పార్క్ లో సమయం గడపండి. మీ పరిమితి తెలుసుకొని క్రమంగా దాన్ని దాటటానికి ప్రయత్నించండి. పొట్ట దానంతట అదే తగ్గి పోతుంది.


జిమ్ లో ఉన్న అన్ని బరువులను ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్చటం అనే వ్యాయామం ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా పెట్టుకొని దాని మీద గంట సేపు ‘వన్ టూ వన్ టూ’ చేయటం కన్నా పది రెట్లు ఉత్తమం. ఈ నిజాన్ని స్వీకరించండి ఏంటంటే బరువుని తగ్గించే వ్యాయామం ఎప్పుడు స్టైలిష్ గా ఉండదు. అది చెడ్డది, ఆయాసం కలిగించేది అయి ఉంటుంది!


బాక్స్ మేటర్ :


అప్పుడప్పుడు ఇవీ ప్రయత్నించండి:
  • సరిగ్గా జిమ్ మూసే వేళకు అక్కడికి వెళ్ళండి. చిందర వందరగా ఉన్న బరువు లన్నిటినీ పది నిమిషాల్లో వేటి చోటులో వాటిని సర్దేయండి.
  • సరిగ్గా జిమ్ తెరిచే వేళకు అక్కడికి వెళ్ళండి. జిమ్ లో ఉన్న డంబెల్స్, ప్లేట్స్, రాడ్స్ వంటివి ఒక చోట నుంచి తీసి మరో చోటికి చేర్చి తిరిగి యథాస్థానంలో ఉంచండి.
  • రోజు మీరు రన్నింగ్ చేస్తుంటారు కదా. అలా కాకుండా ఒకరోజు జిమ్ కి వెళ్లి అక్కడ బరువైన రెండు  డంబెల్స్ ను రెండు చేతుల్లో పట్టుకొని జిమ్ లోనే అటూ ఇటూ నడవండి. దీన్ని ఫార్మర్స్ వాక్ అంటారు.
  • పెద్ద వాహనంది ఏదైనా పాత టయరు దొరికితే, నుంచొని ఉండి దాన్ని పెద్ద సుత్తితో ఇష్టం వచ్చినట్టు బాదండి అది నుజ్జు నుజ్జు అయ్యేదాకా.


గృహ శోభ
మోహిత,
12 అక్టోబర్ 2014

మకర సంక్రాంతి పండుగ సమయంలో మరుష దేశంలోని  తెలుగువారు కోళ్ల పందేలని నిషేధించారు!
అదే సమయంలో, ఆంధ్ర పుణ్య భూమిలో కోళ్ల పందేలు జరుగుతున్నాయి ! ! !

ఈ మాట చెప్పటానికి నేను చాలా కలత చెందుతున్నాను.
మానవులం అయ్యుండి రక్తపాతంతో ఎలా ఆనందించగలం ?
రక్తపు మడుగులో గిలగిలా తన్నుకొని మరణిస్తున్న కోడిపుంజును చూసి ఎలా ఆనందం పొందగలం?

మానవునిలో హింసాప్రవృత్తిని సంతృప్తిపరిచేందుకు మార్గాలను కనుగొని కోళ్ల పందేలు మంచివే అంటాం !!!!!!!
ఇది అమానుషం కాదా !!!!!!!!
అనంగీకారం కాదా !!!!!
ఇలాంటి ఆలోచనతో ఎంత నీచ స్థాయికి చేరుకున్నామో ఊహించండి !!!!

స్వామి చిన్మయానంద చెప్పినట్టు - మకర సంక్రాతి పర్వదినం అంటే భూమిపై సకల జీవరాశిని పోషించే సూర్యభగవానుడికి, మన తల్లి ప్రకృతికి మనం కృతజ్ఞత చూపాల్సిన సమయం!

కాని ప్రవర్తనలో ఎంత వైరుధ్యం!!

కనుమ రోజున వ్యవసాయంలో మనకు అడుగడుగునా దన్నుగా ఉండే పశువులను పూజిస్తాం. మరో వైపు, కోళ్ల పందేలని చూస్తూ హింసాకాండను ఆస్వాదిస్తూ వినోదిస్తాం.

నేను మీ భావాలను బాధించి ఉండవచ్చు, కాని అది ఒక లోతైన ఆలోచన కోసం అని గ్రహించండి.  

సాయిరాం.

--సంజీవ నరసింహ అప్పడు, మారిషస్, మకర సంక్రాతి, దుర్ముఖి నామ సంవత్సరం
15 జనవరి 2017

Friday, 4 October 2013

వంగూరి ఫౌండేషన్ వారి మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం లో ఎంపికైన కవిత, 2013 సావెనీర్ లో ప్రచురితం  (30సెప్టెంబర్ 2013)


లైవ్ ‘స్టాక్ మార్కెట్’
‘Livestock’ market


మొన్న సంతలో కన్నీటి చుక్కను బేరం పెట్టాను
వెయ్యి నవ్వులైనా కొంటారట
కన్నీళ్లు మాకెందుకని పెదవి విరిచారు.
తోక ముడిచేందుకు బేలను కాను నేను
ఇరవై ఒకటవ శతాబ్దపు మనిషిని
దుః ఖాన్నైనా  క్యాష్ చేసుకోగలను !


మార్కెటింగ్ వ్యూహం పన్నాను
కుడి కంటి చుక్కకి ఎడమది ఫ్రీ అన్నాను
ఆర్డరిస్తే  మూడో కంట్లోది కూడా తెప్పిస్తా అన్నాను
రంగు రంగుల కర్చీఫ్ మీ సొంతం అన్నాను
వెర్రిబాగుల దాన్ని అని తప్పుకున్నారు .


అడ్వర్టైజింగ్  హంగులద్దాను
పాంఫ్లెట్లు  పంచాను
365,24/7 మీ ఒంటరితనపు తోడు అన్నాను
తులాభారం లో తులసీ దళం ఇదే అని మొత్తుకున్నాను
ఏడు వాద్యాల హోరులో ఏడుపు  యేరు లా పారుతుందన్నాను
ఆసక్తిగా చూశారు కాని కొనే వారే కరువయ్యారు .


ఊహు దీన్నిలా కాదు-
అయ్యా బాబూ అంటే మాట వినరు.  
జనం నడ్డి విరగ్గొట్టి కొనిపించాలి


అందుకే నిన్నట్నుంచి స్ట్రాటజీ  మార్చాను.  


కౌన్ బనేగా ఏడుపుపతి ?
ఏడ్చిన వాళ్లకి ఏడ్చినంత !
కన్నీరు లేని టీవీ సీరియల్ మీద క్విజ్


ఈ ముక్కెవరిది మూతెవరిది ?
మోసం తో సొమ్ము ఊడ్చు కెళ్ళిన వారి ఫోటో గుర్తు పట్టండి
వరద లొస్తే  రైతులు ఏం  చేస్తారు ?
ఎ ) బి ) సి ) డి ) 55555 కి ఎస్ ఎం ఎస్  పంపండి
ఆఖరి ఎపిసోడు లో ఎవరు ఏడుస్తారు?
వచ్చే వారం దాకా ఆగండి
“ఏడ్చే దాని మొగుడొస్తే …. “ నేడే చూడండి నాలుగాటలు


వింతలమారి తంపులమారి గమ్మత్తైన ప్రపంచం !!
కన్నీళ్లను ఎగబడి కొన్నారు !
కానీ, ఎవరూ వాడినట్లు కనబడట్లా !


పరీక్షలో ఫెయిల్ అయినా , ప్రేమలో విఫలమైనా
జీవితాంతం దాచుకుంది దొంగలెత్తు కెళ్ళినా
చంపుతున్నారు, చస్తున్నారు
ఎవరూ ఏడవట్లా .
అయినా నాకెందుకూ?


వస్తువులను వాడుకోవాలి
మనుషులను ప్రేమించాలి
ఇవ్వాళ  ఇది ఉల్టా .


అనవసర వస్తువులు కొనే  వినిమయ జగత్తులో
నేను సక్సెస్ , నా బిజినెస్ ఎక్సెస్  అని వేరే చెప్పాలా ?
నా కన్నీళ్ళ న్నీ అమ్మేసి
పక పకా నవ్వుతున్నాను !!


--మోహిత

Thursday, 1 August 2013

అందరికీ నమస్కారం .  ఈ ఆగష్టు విపుల మాస పత్రిక రొమాంటిక్ స్పెషల్ చదివి అభిప్రాయం తెలియజేయండి. 
దిగంబర రహస్యం


యునెస్కో ప్రతినిధులు  ఇండియాలోని చారిత్రక కట్టడాల లిస్ట్ తయారు చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు. అణువణువూ జల్లెడ పట్టి చరిత్రని వెలికి తీయాలని జల్లెడలు పట్టుకొని ఒక పాత ప్రహరీ గోడ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరున్న యంత్రాలతో పరీక్షించి చూస్తే అది చైనా వాల్ కన్నా చాలా గట్టిగా ఉందని తేలింది. ఆఫీసర్లు ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ ని సంప్రదించారు. ఆయనేమో తన హయాంలో గానీ కులీ కుతుబ్ షా హయాం లో గానీ అలాంటి గోడే కట్టించలేదని మ్యూజియం గోడ గుద్ది  చెప్పాడు. ఆ గోడ కట్టటానికి ఏయే పదార్థాలు వాడారో తెలుసుకోవటానికి దాని మీది సున్నం గీరి కెమికల్ ఎనాలిసిస్ కు పంపించారు. గోడకి కాపలాగా ఇద్దరు సెంట్రీలని పెట్టారు.


*  *  *
రాత్రి ఒంటిగంట.
ఒక ముసుగు మనిషి పలుగూ పారలతో ఆ గోడ దగ్గర తచ్చాడుతూ సెంట్రీ ల చేతికి చిక్కాడు. ‘అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోడను కూల్చే దురుద్దేశం తోనే అక్కడికి వచ్చాడ’నే అభియోగం మోపబడింది. 
మరుసటి రోజు కోర్టులో “ నేను కొంపా గోడా కూల్చే రకం గాదండి! కిందున్న మట్టి కోసమే ఒచ్చాను”  అని మొత్తుకున్నాడు.
“మట్టి అక్రమ రవాణా కేసు బుక్ చేద్దామ”న్నాడు పీపీ.
“అతను మట్టి పిసుక్కునేవాడు , వదిలేద్దాం“ అన్నాడు డిఫెన్సు.
“ఇంతకీ ఆ మట్టి ఎందుక”న్నారు జడ్జిగారు.
“ అయ్యా! తవరు ఇంటానంటే కేసులు గీసులు ఎయ్యనంటే నిజం సెప్తానండయ్య “
“భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. కేసు సంగతి నేను చూసుకుంటా“
“సత్తె పెమాణకంగా, ఈ మట్టి మొక్కలకేత్తానండయ్య! అయి ఏపుగా ఎదిగి పూటుగా కాయలిత్తయండయ్య !”
“నువ్వు మొక్కల్ని పెంచే నేలలో సారం లేకపోతే ఎరువులెయ్యాలి గానీ మట్టెయ్యడమేంటి ?”
“అయ్యన్నీ కల్తీ ఎరువులండయ్య . ఈ మట్టిలో నూటికి రొండొందల శాతం కల్తీ ఉండదయ్య ! కావాలంటే పరీచ్చ జేపిచ్చుకోండి”

మట్టిని కూడా కెమికల్ ఎనాలిసిస్ కి  పంపారు.
*  *  *
రెండింటి రిపోర్టులు వచ్చాయి.

“నాకు నమ్మశక్యం కావటం లేదు డైరెక్టర్ గారూ. ఇట్స్ ఇంపాజిబుల్ “ అన్నాడు యునెస్కో ప్రతినిధి. ఆర్కియాలజీ డైరెక్టర్ తల పట్టుకు కూర్చున్నాడు. ఈ గోడ మన దేశాన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్ళిందో తేల్చుకోలేక గోడ మీద పిల్లిలా సతమతమవుతున్నాడు.
“గోడ మీదకి యూరియా ఎలా వచ్చింది?” ఆ అడగటం అచ్చం యమలీల సినిమా లో బ్రహ్మానందం “ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడెలా వేసింది?” స్టైల్లో ఉంది.
“నాకేం అర్థం కావటం లేదు. డిటెక్టివ్ యుగంధర్ ని పిలిపిద్దాం”


*  *  *
యుగంధర్ ఆ రోజే రంగం లోకి దిగాడు. మట్టి, గోడ - రెండింటి మీదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఎన్నిబస్తాల యూరియా వేస్తే ఇంత సారవంతమైన ఎరువు వస్తుంది లాంటి లెక్కలు కట్టాడు. ఇటుక బట్టీల వెంబడి, సిమెంట్ ఫ్యాక్టరీల వెంబడి, సున్నం  తయారు చేసే చోట్లకీ తిరిగి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఒకే చోట ఇంత యూరియా మాత్రం అసాధ్యం అని తేలింది. ఈ రహస్యం ఛేదించాలంటే గోడకున్న పటిష్ఠమైన కాపలా తొలగించాలని కోరాడు.

*  *  *

అప్పటికి రెండు నిమిషాలైంది కాపలా వాళ్ళు వెళ్లి పోయి. యుగంధర్ ఒక చెట్టు చాటున నక్కి చూస్తున్నాడు. ఒకాయన అటుగా నడుస్తూ వెళ్తున్నాడు. గోడని చూడగానే ఏదో గుర్తొచ్చినట్టు ఠపీమని ఆగిపోయాడు. ప్యాంటు జిప్ తీశాడు. గోడ వైపు తిరిగి  పని కానిచ్చి ఏమెరగనట్టు వెళ్ళిపోయాడు. రెండు గంటలు గడిచేసరికి రెండొందలమందిని లెక్క పెట్టాడు యుగంధర్! అవాక్కయ్యాడు! తన ఎసైన్మెంట్స్ దృష్ట్యా ఎక్కువ విదేశాల్లోనే గడపటం వల్ల
భారతీయులకి ఇలాంటి అలవాటు ఉంటుందని అసలు తెలీకుండా పోయింది.

  ఇంతలో ఒకబ్బాయి వచ్చి పొజిషన్ లో నుంచొని కుడి చేత్తో ముక్కు మూసుకొని మరీ తల పైకెత్తి ఈల వేస్తూ గోడమీద డిజైన్లు వెయ్యడం యుగంధర్ తట్టుకోలేక పోయాడు. ఒక్కంగలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్దామని కాలు వేశాడో లేదో అది కాస్తా అక్కడి బురదలో కూరుకు పోయింది!
“కొంచెం చూసుకోవాలి బ్రదర్ “ అని ఆ అబ్బాయి ఉచిత సలహా పారేసి తన దారిన చక్కాపోయాడు.
తోటి భారతీయుణ్ణి ఏమని తిట్టాలో తెలీక యుగంధర్  తంటాలుపడి బయటపడి గోడ మీదకి యూరియా ఎలా చేరిందో, అంటు వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికనిచ్చి పర్మనెంటుగా సింగపూర్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

ఇదీ యుగంధర్ శోధించిన దిగంబర రహస్యం!

యునెస్కో ప్రతినిధులు మాత్రం చాలా చోట్ల చెప్పుల దండలు కట్టిన గోడల్ని చూస్తూ గోడలకి చెప్పులెందుకబ్బా,  అవి నడవ లేవు కదా అని ఆశ్చర్యపోతూనే ఉన్నారు!



-మోహిత


For ‘Vibrations’

Wednesday, 10 July 2013

ఆ నలుగురు


అగ్గిపెట్టె లాంటి ఆ ఇంట్లో అగ్గిపుల్లలు ఐదు.
సగం విరిగిన అగ్గిపుల్లలాంటి ఓ ముసలాయన. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అగ్గిపుల్ల లాంటి ఓ చిన్న పిల్లాడు. ఒక్కసారి గియ్యగానే భగ్గున మండిపోయే అగ్గిపుల్లలాంటి ఓ చలాకీ పడుచు పిల్ల. తలలంటుకుపోయిన అగ్గిపుల్లల్లా జీవితాలు అతుక్కుపోయిన ఓ మొగుడూ పెళ్ళాం!
        వీళ్ళలో నలుగురు రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నర కొట్టేప్పటికి పెట్టెలోంచి బైట కొస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ముసలాయన ఓపికుంటే పెట్టె తోసుకొని బయట పడతాడు, లేకపోతే హాల్లో కిటికీలోంచి పెట్టె బయట ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటాడు. రాత్రి పదయ్యేసరికి మిగతా నలుగురూ క్షేమంగా పెట్టెలోకి చేరుకుంటారు. ఇది క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం. నదులని సముద్రం కలిపినట్టు వాళ్ళని ఆ పెట్టె కలుపుతూ ఉంటుంది.
  
     ఒకరోజు ముసలాయన పెట్టె కిటికీలోంచి బయటకు చూస్తుంటే కనపడ్డాయి నాలుగు దృశ్యాలు. 1) మనవరాలు ఎవరో కుర్రాడి పల్సర్ బైక్ మీంచి దిగింది.  2) మనవడు నలుగురు క్లాస్ మేట్స్
కూర్చున్న యాక్టివా బండి మీంచి దిగాడు. 3) కోడలు కంపెనీ ఇండికా కార్లోంచి దిగి ఎవరికో చేతులూపింది. 4) కొడుకు పక్కింటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు కాబోలు - ముందు ఆ గేటు ముందాగి తర్వాత తమ ఇంటి ముందాగింది స్ప్లెండర్.
      పెట్టె ఒకటే అయినా ఏ పుల్ల దారి ఆ పుల్ల చూసుకుంటోందని అర్థమైంది ముసలి పుల్లకి.
కనీసం రాత్రికి పుల్లలన్నీ ఇంటికి చేరుతున్నందుకు సంతోషించాడు. గోడ మీద క్యాలెండర్ వంక చూసి ఎవరికేరోజు క్లాసు పీకాలో డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు.


   మనవడి దగ్గర్నుంచీ మొదలై వయసు ఆరోహణ క్రమంలో క్లాసులు పూర్తయ్యాయి. పెర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్ మెంట్ లేదని, ఇటువంటి తరగతులు ప్రతి నెలా పెట్టాలని ఆయన డిసైడయ్యాడు. తన వయసులో కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత నిర్వర్తించాలని ఆయన గుర్తించాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుకొని సరిపెట్టుకున్నారు.
  
    ఎంసెట్ దగ్గర పడే కొద్దీ కోచింగ్ ఇంటెన్సిటీ పెరిగినట్టు, ఈయనకు టైం దగ్గర పడే కొద్దీ క్లాసులు ఎక్కువై పోయాయి.  కొన్నాళ్ళ తరువాత పెట్టెలో నాలుగు పుల్లలే మిగిలాయి.

    నలుగురూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన నియంత్రించే పెద్ద తలకాయ లేకుండా పోయింది. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోవడం రావడం చేసేవారు. దానికి తోడు మొబైల్ ఫోన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దాడి చేశాయి. ఈ చిన్న పెట్టె సరిపోవడం లేదనిపించింది. కోరికలు గుర్రాలయ్యాయి. ఆ గుర్రాలకి రెక్కలొచ్చాయి. గాలి వాటానికి రెక్కలెటు తీసుకెళ్తే అటు ఎగిరి పోయారు ఆ నలుగురూ. పెట్టె ఈ మధ్య ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటోంది.
 
       పెట్టె నలుగుర్నీ దగ్గర చేసేది. ఐదో అగ్గిపుల్ల వల్ల ఆ దగ్గరితనం సాధ్యమయ్యేది.


     ఇప్పుడు దృక్పథం మారింది. విశాలమైన వాకిళ్ళూ పడక గదులూ ఉంటే బాగుండే దనుకున్నారు. అవి సాధించు కోవడానికి , రాత్రికి రాత్రి కలలు నిజం చేసుకోవడానికి పూనుకున్నారు. షార్ట్ కట్ లో ప్రయాణించారు. చరిత్ర అడ్డదారులు తొక్కద్దని చెప్తూనే ఉంటుంది. మనుషులు చరిత్రను పునరావృతం చేస్తూనే ఉంటారు. చెప్పిన క్లాసులే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటారు. కవరైన పోర్షనే మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తారు. వాళ్లకు విశాలంగా ఉండాల్సింది ఇల్లు కాదు, హృదయం అని  అర్థమవుతుంది. కలకాలం ఉండాల్సింది బంధాలు, బాంధవ్యాలు అని అర్థమవుతుంది. కానీ అప్పటికే అగ్గిపుల్ల కాలి బూడిదైపోతుంది.


-మోహిత
For ‘Vibrations’