Thursday 1 August 2013

దిగంబర రహస్యం


యునెస్కో ప్రతినిధులు  ఇండియాలోని చారిత్రక కట్టడాల లిస్ట్ తయారు చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు. అణువణువూ జల్లెడ పట్టి చరిత్రని వెలికి తీయాలని జల్లెడలు పట్టుకొని ఒక పాత ప్రహరీ గోడ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరున్న యంత్రాలతో పరీక్షించి చూస్తే అది చైనా వాల్ కన్నా చాలా గట్టిగా ఉందని తేలింది. ఆఫీసర్లు ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ ని సంప్రదించారు. ఆయనేమో తన హయాంలో గానీ కులీ కుతుబ్ షా హయాం లో గానీ అలాంటి గోడే కట్టించలేదని మ్యూజియం గోడ గుద్ది  చెప్పాడు. ఆ గోడ కట్టటానికి ఏయే పదార్థాలు వాడారో తెలుసుకోవటానికి దాని మీది సున్నం గీరి కెమికల్ ఎనాలిసిస్ కు పంపించారు. గోడకి కాపలాగా ఇద్దరు సెంట్రీలని పెట్టారు.


*  *  *
రాత్రి ఒంటిగంట.
ఒక ముసుగు మనిషి పలుగూ పారలతో ఆ గోడ దగ్గర తచ్చాడుతూ సెంట్రీ ల చేతికి చిక్కాడు. ‘అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోడను కూల్చే దురుద్దేశం తోనే అక్కడికి వచ్చాడ’నే అభియోగం మోపబడింది. 
మరుసటి రోజు కోర్టులో “ నేను కొంపా గోడా కూల్చే రకం గాదండి! కిందున్న మట్టి కోసమే ఒచ్చాను”  అని మొత్తుకున్నాడు.
“మట్టి అక్రమ రవాణా కేసు బుక్ చేద్దామ”న్నాడు పీపీ.
“అతను మట్టి పిసుక్కునేవాడు , వదిలేద్దాం“ అన్నాడు డిఫెన్సు.
“ఇంతకీ ఆ మట్టి ఎందుక”న్నారు జడ్జిగారు.
“ అయ్యా! తవరు ఇంటానంటే కేసులు గీసులు ఎయ్యనంటే నిజం సెప్తానండయ్య “
“భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. కేసు సంగతి నేను చూసుకుంటా“
“సత్తె పెమాణకంగా, ఈ మట్టి మొక్కలకేత్తానండయ్య! అయి ఏపుగా ఎదిగి పూటుగా కాయలిత్తయండయ్య !”
“నువ్వు మొక్కల్ని పెంచే నేలలో సారం లేకపోతే ఎరువులెయ్యాలి గానీ మట్టెయ్యడమేంటి ?”
“అయ్యన్నీ కల్తీ ఎరువులండయ్య . ఈ మట్టిలో నూటికి రొండొందల శాతం కల్తీ ఉండదయ్య ! కావాలంటే పరీచ్చ జేపిచ్చుకోండి”

మట్టిని కూడా కెమికల్ ఎనాలిసిస్ కి  పంపారు.
*  *  *
రెండింటి రిపోర్టులు వచ్చాయి.

“నాకు నమ్మశక్యం కావటం లేదు డైరెక్టర్ గారూ. ఇట్స్ ఇంపాజిబుల్ “ అన్నాడు యునెస్కో ప్రతినిధి. ఆర్కియాలజీ డైరెక్టర్ తల పట్టుకు కూర్చున్నాడు. ఈ గోడ మన దేశాన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్ళిందో తేల్చుకోలేక గోడ మీద పిల్లిలా సతమతమవుతున్నాడు.
“గోడ మీదకి యూరియా ఎలా వచ్చింది?” ఆ అడగటం అచ్చం యమలీల సినిమా లో బ్రహ్మానందం “ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడెలా వేసింది?” స్టైల్లో ఉంది.
“నాకేం అర్థం కావటం లేదు. డిటెక్టివ్ యుగంధర్ ని పిలిపిద్దాం”


*  *  *
యుగంధర్ ఆ రోజే రంగం లోకి దిగాడు. మట్టి, గోడ - రెండింటి మీదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఎన్నిబస్తాల యూరియా వేస్తే ఇంత సారవంతమైన ఎరువు వస్తుంది లాంటి లెక్కలు కట్టాడు. ఇటుక బట్టీల వెంబడి, సిమెంట్ ఫ్యాక్టరీల వెంబడి, సున్నం  తయారు చేసే చోట్లకీ తిరిగి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఒకే చోట ఇంత యూరియా మాత్రం అసాధ్యం అని తేలింది. ఈ రహస్యం ఛేదించాలంటే గోడకున్న పటిష్ఠమైన కాపలా తొలగించాలని కోరాడు.

*  *  *

అప్పటికి రెండు నిమిషాలైంది కాపలా వాళ్ళు వెళ్లి పోయి. యుగంధర్ ఒక చెట్టు చాటున నక్కి చూస్తున్నాడు. ఒకాయన అటుగా నడుస్తూ వెళ్తున్నాడు. గోడని చూడగానే ఏదో గుర్తొచ్చినట్టు ఠపీమని ఆగిపోయాడు. ప్యాంటు జిప్ తీశాడు. గోడ వైపు తిరిగి  పని కానిచ్చి ఏమెరగనట్టు వెళ్ళిపోయాడు. రెండు గంటలు గడిచేసరికి రెండొందలమందిని లెక్క పెట్టాడు యుగంధర్! అవాక్కయ్యాడు! తన ఎసైన్మెంట్స్ దృష్ట్యా ఎక్కువ విదేశాల్లోనే గడపటం వల్ల
భారతీయులకి ఇలాంటి అలవాటు ఉంటుందని అసలు తెలీకుండా పోయింది.

  ఇంతలో ఒకబ్బాయి వచ్చి పొజిషన్ లో నుంచొని కుడి చేత్తో ముక్కు మూసుకొని మరీ తల పైకెత్తి ఈల వేస్తూ గోడమీద డిజైన్లు వెయ్యడం యుగంధర్ తట్టుకోలేక పోయాడు. ఒక్కంగలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్దామని కాలు వేశాడో లేదో అది కాస్తా అక్కడి బురదలో కూరుకు పోయింది!
“కొంచెం చూసుకోవాలి బ్రదర్ “ అని ఆ అబ్బాయి ఉచిత సలహా పారేసి తన దారిన చక్కాపోయాడు.
తోటి భారతీయుణ్ణి ఏమని తిట్టాలో తెలీక యుగంధర్  తంటాలుపడి బయటపడి గోడ మీదకి యూరియా ఎలా చేరిందో, అంటు వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికనిచ్చి పర్మనెంటుగా సింగపూర్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

ఇదీ యుగంధర్ శోధించిన దిగంబర రహస్యం!

యునెస్కో ప్రతినిధులు మాత్రం చాలా చోట్ల చెప్పుల దండలు కట్టిన గోడల్ని చూస్తూ గోడలకి చెప్పులెందుకబ్బా,  అవి నడవ లేవు కదా అని ఆశ్చర్యపోతూనే ఉన్నారు!



-మోహిత


For ‘Vibrations’

No comments:

Post a Comment