Wednesday 17 April 2013


జబ్ వియ్ మెట్
(ఒక మూగ చెవిటి ప్రేమ కథ)


రైలు నెమ్మదిగా వెళుతోంది.

బ్యాగ్ మీద తల పెట్టి “ది పేల్ హార్స్ “ చదువుతున్న హారిక కి ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తే తల తిప్పింది. ఆ అబ్బాయి చూపులు! ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఏదో మాట్లాడాలని ట్రై చెయ్యటం, అది గమనించనట్టు తను తల తిప్పుకోవటం. అసలు సంగతి ఏంటో తేల్చెయ్యాలి అని కళ్ళెత్తి ఆ అబ్బాయి వంక చూసింది .

తన వంక చూడగానే ఒక పేపర్ ఇచ్చాడు. హారికకి మరీ బ్రాడ్ గేజ్ లో కాకపోయినా మీటర్ గేజ్ లో లైనేసే లైన్ మెన్లు ఉన్నారు కానీ  రాజధాని ఎక్స్ ప్రెస్ లా ఇంత ఫాస్ట్ గా లవ్ లెటర్ - మొదటిసారి. అనాలోచితంగా తెరిచి చూసింది. ముత్యాల్లాంటి తెలుగు.

“ఇంగ్లీష్ పుస్తకం చదువుతున్నారు తెలుగొచ్చా? మిమ్మల్ని ఇప్పటికి ఐదు సార్లు పిలిచాను. చెవుడనుకుంటా. కొంచెం  మంచి నీళ్లుంటే ఇస్తారా ?”
యాజ్ ఇఫ్ ఇతనికి మంచి నీళ్ళు సప్లై చెయ్యటానికే తను ఎదురు బెర్త్ లో ఉన్నట్టు ! వళ్ళు మండింది. ప్రయాణం
లో ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవచ్చుగా !పెన్నిమ్మన్నట్టు సైగ చేసింది.
“అవును  నాకు మూగ ,చెవుడు “ అని జవాబు రాసి ఇచ్చింది.
“అయ్యో పాపం! పుట్టుక తోనా?”
“పూర్వ జన్మ లో కూడా ఇంతేట. జ్యోతిష్కులు చెప్పారు. ఐనా నన్ను చూసి జాలి పడే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. “
“మీరు చాలా ఆత్మాభిమానం గల వారనుకుంటాను. ఎక్కడిదాకా వెళ్తున్నారు?”
హారిక కి చిరాకేసింది.  అద్భుతమైన మర్డర్ మిస్టరీ చదువుతుంటే మధ్యలో ఈ డిస్టర్బన్స్ ఏంటి ?అందుకే ఇలా పెంకిగా రాస్తోంది.
“ఎక్కడ నన్ను నన్నుగా గౌరవిస్తారో అక్కడిదాకా “
“గట్టి వాళ్ళే . ఏం  చదివారు ?”
వదిలేలా లేడు .  
“ఎమ్. ఎమ్. “
“అంటే”
పుస్తకం లో  నెక్స్ట్ పేజి లో స్టొరీ ఏమవుతుందో అని ఆత్రుత గా ఉంది.
“మాస్టర్స్  ఇన్ మర్డర్ “
కొంచెం ఇబ్బందిగా  చూశాడు. జవాబు తట్టలేదేమో అని రిలీఫ్ గా మళ్ళీ పుస్తకం లో తల దూర్చింది . ఇస్స్ ఇస్స్ అని సౌండ్. పాము అనుకొని ఉలిక్కిపడింది. ఆ అబ్బాయి పిలుస్తున్నాడు.
“సారీ పేపర్ నిండిపోయింది. అందుకే ఇలా. ఇంతకీ మీ పేరేంటి? “ అని న్యూస్ పేపర్ మీద రాశాడు మహానుభావుడు .
“వెంకట లక్ష్మి”
“వెంకట లక్ష్మి గారు,నా పేరు విజయ్. సంగీతం, సాహిత్యం ఇష్టం. అయినా బ్రతుకు తెరువు కోసం  ఎమ్ సి ఏ చేశాను. ఉద్యోగ వేట లో ఈ ప్రయాణం. అదీ క్లుప్తంగా నా గురించి. మీరు చెప్పండి “
“నా గురించి చెప్పాలంటే ఈ న్యూస్ పేపర్ సరిపోదు లెండి. పోనిద్దురూ “
“చరిత్ర హీనులు కాదన్నమాట !” అని పెద్దగా నవ్వు. మళ్ళీ తనే ”అలా అనకూడదేమో కదా! “ అని రాశాడు పెన్ను లాక్కొని.
“ఈ సారి స్టేషన్ వచ్చినప్పుడు దిగి కొంచెం మంచి నీళ్ళు పట్టుకురండి “
“ఓ మీకు కూడా దాహం వేస్తోందా ? చూశారా , మన అభిరుచులు ఎలా కలిశాయో !”
హారిక నవ్వద్దనుకుంటూనే  నవ్వింది.

*
హారిక పుస్తకం పక్కన పెట్టేసింది. ఇద్దరూ బోల్డన్ని కబుర్లు రాసుకున్నారు. పేపర్ అంతా ఇంకు పూసుకున్నారు.
“మీరు అసలు తెలుగు అమ్మాయి అనుకోలేదు “
“అచ్చంగా తెలుగే. మీరూ ఇంత చక్కటి వ్యక్తిత్వం గలవారు అనుకోలేదు”
“తిడతారేమో నని చాలా  భయపడ్డాను..”
“పుస్తకం చదివేప్పుడు కదిలిస్తే డొక్క చించి డోలు కట్టాలనిపిస్తుంది”
“హబ్బో కోపం ఇంకా తగ్గలేదా?”
“ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచం లో ఇంకా ఎదుటి మనిషి కోపాన్ని గుర్తించ గలిగిన వారున్నారా”
“చాలా రిజర్వుడ్ గా కనిపించారు”
“పై పై మెరుగులు మోసం చేస్తాయండొయ్”
“అదే నేనూ చెప్తున్నాను “

*
గమ్యం దగ్గరవుతున్నదన్న సూచనగా రైలు స్లో అయింది. ఆ అబ్బాయి ముఖం లో టెన్షన్.
“మీకు అభ్యంతరం లేక పోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను “
హారిక లో చిన్న కలవరపాటు. మేటర్ మరీ సీరియస్ అయ్యేలావుందే. ఇప్పుడెలా ?
“నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు . చెప్పానుగా జాలి చూపించే వాళ్ళంటే నాకు గిట్టదు .ఎప్పుడైనా దూర దర్శన్ లో ఆదివారం మధ్యాహ్నం  వార్తలు చూసిన ఫేసేనా ?”
“మీరు నాకు మొదటి చూపులోనే  నచ్చారు . మీకూ  నేను నచ్చాను గా . ఇంకేంటి అభ్యంతరం?”
ఈ జిడ్డు మొహమూ, చింపిరి జుట్టు తోనే నచ్చానా అని సందేహ పడి
“నాకు మీరు నచ్చారని ఎలా తెలుసు ?” అని అడిగింది.
“బెర్త్ ఎక్కినప్పుడు మీరు నా వంక ఆరాధనా పూర్వకంగా  చూసిన చూపు నేను ఎన్నటికీ మరువలేను . “
ఓరినీ అలా అనుకున్నావా ? యాక్చువల్లి హారిక రైలు మొదలయ్యే స్టేషన్ లో ఎక్కడం వల్ల  అప్పటికి ఎక్కువ
శాతం ఖాళీగానే ఉంది. అప్పటికే ఈ అబ్బాయి బెర్త్ మీద హాయిగా దుప్పటి పరుచుకున్నాడు. ఆడవాళ్ళకి సీట్లు ఇచ్చే రకం కాదు అని ఒకానొక తిరస్కారంగా చూసిందే. పిల్లాడు ఆరాధన అంటాడేంటి ?

“మీరు ఏదో ఆవేశంలో అంటున్నారు . అయినా  ఇక చెప్పటానికి కూడా ఏమి లేదు, రాయటానికి కూడా ప్లేస్ లేదు. స్టేషన్ వచ్చేస్తోంది, దిగుదాం “
అది చదివి అతను జాలి చూపులు విసిరాడు. పేపర్ ఉండ చుట్టి కిటికీ లోంచి విసిరెయ్యమని సైగ చేసింది. మడత పెట్టి భద్రంగా జేబులో పెట్టి ‘సేఫ్ హియర్’ అన్నట్టు సైలెంట్ గా నవ్వాడు. న్యూస్ పేపర్ కావడం వల్ల జేబు చాలా లావుగా కనిపిస్తోంది. అందుకని దుప్పటి మడత లో పెట్టి బాగ్ లోసర్దేశాడు. స్టేషన్లో దిగుతున్నప్పుడు చివరి సారిగా అభ్యర్ధించాడు సైగ ల తో ప్లీజ్ కనీసం ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి అని.

నోరంతా  తెరిచి “మూగ, చెవిటి వాళ్లకి ఫోన్లతో ఏమి పని ఉంటుంది?” అనేసి ట్రైన్ దిగేసింది. హారిక నడుస్తుంటే ఇంకా ఆ అబ్బాయి చూపులు గుచ్చుకుంటూనే ఉన్నాయి!!

- మోహిత
For ‘Vibrations’