Wednesday 10 July 2013

ఆ నలుగురు


అగ్గిపెట్టె లాంటి ఆ ఇంట్లో అగ్గిపుల్లలు ఐదు.
సగం విరిగిన అగ్గిపుల్లలాంటి ఓ ముసలాయన. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అగ్గిపుల్ల లాంటి ఓ చిన్న పిల్లాడు. ఒక్కసారి గియ్యగానే భగ్గున మండిపోయే అగ్గిపుల్లలాంటి ఓ చలాకీ పడుచు పిల్ల. తలలంటుకుపోయిన అగ్గిపుల్లల్లా జీవితాలు అతుక్కుపోయిన ఓ మొగుడూ పెళ్ళాం!
        వీళ్ళలో నలుగురు రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నర కొట్టేప్పటికి పెట్టెలోంచి బైట కొస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ముసలాయన ఓపికుంటే పెట్టె తోసుకొని బయట పడతాడు, లేకపోతే హాల్లో కిటికీలోంచి పెట్టె బయట ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటాడు. రాత్రి పదయ్యేసరికి మిగతా నలుగురూ క్షేమంగా పెట్టెలోకి చేరుకుంటారు. ఇది క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం. నదులని సముద్రం కలిపినట్టు వాళ్ళని ఆ పెట్టె కలుపుతూ ఉంటుంది.
  
     ఒకరోజు ముసలాయన పెట్టె కిటికీలోంచి బయటకు చూస్తుంటే కనపడ్డాయి నాలుగు దృశ్యాలు. 1) మనవరాలు ఎవరో కుర్రాడి పల్సర్ బైక్ మీంచి దిగింది.  2) మనవడు నలుగురు క్లాస్ మేట్స్
కూర్చున్న యాక్టివా బండి మీంచి దిగాడు. 3) కోడలు కంపెనీ ఇండికా కార్లోంచి దిగి ఎవరికో చేతులూపింది. 4) కొడుకు పక్కింటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు కాబోలు - ముందు ఆ గేటు ముందాగి తర్వాత తమ ఇంటి ముందాగింది స్ప్లెండర్.
      పెట్టె ఒకటే అయినా ఏ పుల్ల దారి ఆ పుల్ల చూసుకుంటోందని అర్థమైంది ముసలి పుల్లకి.
కనీసం రాత్రికి పుల్లలన్నీ ఇంటికి చేరుతున్నందుకు సంతోషించాడు. గోడ మీద క్యాలెండర్ వంక చూసి ఎవరికేరోజు క్లాసు పీకాలో డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు.


   మనవడి దగ్గర్నుంచీ మొదలై వయసు ఆరోహణ క్రమంలో క్లాసులు పూర్తయ్యాయి. పెర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్ మెంట్ లేదని, ఇటువంటి తరగతులు ప్రతి నెలా పెట్టాలని ఆయన డిసైడయ్యాడు. తన వయసులో కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత నిర్వర్తించాలని ఆయన గుర్తించాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుకొని సరిపెట్టుకున్నారు.
  
    ఎంసెట్ దగ్గర పడే కొద్దీ కోచింగ్ ఇంటెన్సిటీ పెరిగినట్టు, ఈయనకు టైం దగ్గర పడే కొద్దీ క్లాసులు ఎక్కువై పోయాయి.  కొన్నాళ్ళ తరువాత పెట్టెలో నాలుగు పుల్లలే మిగిలాయి.

    నలుగురూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన నియంత్రించే పెద్ద తలకాయ లేకుండా పోయింది. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోవడం రావడం చేసేవారు. దానికి తోడు మొబైల్ ఫోన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దాడి చేశాయి. ఈ చిన్న పెట్టె సరిపోవడం లేదనిపించింది. కోరికలు గుర్రాలయ్యాయి. ఆ గుర్రాలకి రెక్కలొచ్చాయి. గాలి వాటానికి రెక్కలెటు తీసుకెళ్తే అటు ఎగిరి పోయారు ఆ నలుగురూ. పెట్టె ఈ మధ్య ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటోంది.
 
       పెట్టె నలుగుర్నీ దగ్గర చేసేది. ఐదో అగ్గిపుల్ల వల్ల ఆ దగ్గరితనం సాధ్యమయ్యేది.


     ఇప్పుడు దృక్పథం మారింది. విశాలమైన వాకిళ్ళూ పడక గదులూ ఉంటే బాగుండే దనుకున్నారు. అవి సాధించు కోవడానికి , రాత్రికి రాత్రి కలలు నిజం చేసుకోవడానికి పూనుకున్నారు. షార్ట్ కట్ లో ప్రయాణించారు. చరిత్ర అడ్డదారులు తొక్కద్దని చెప్తూనే ఉంటుంది. మనుషులు చరిత్రను పునరావృతం చేస్తూనే ఉంటారు. చెప్పిన క్లాసులే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటారు. కవరైన పోర్షనే మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తారు. వాళ్లకు విశాలంగా ఉండాల్సింది ఇల్లు కాదు, హృదయం అని  అర్థమవుతుంది. కలకాలం ఉండాల్సింది బంధాలు, బాంధవ్యాలు అని అర్థమవుతుంది. కానీ అప్పటికే అగ్గిపుల్ల కాలి బూడిదైపోతుంది.


-మోహిత
For ‘Vibrations’

Wednesday 3 July 2013

ఎం. బి. ఏ చదువులు

ఎం. బి. ఏ చదువులు

“దోసిలి నిండా ఊసులని ఎక్కడికీ తీసుకెళుతున్నావ్ ?”
“అదిగో, ఆ దిబ్బ మీద ఒంటరి పువ్వు కిద్దామని !”

* * *
లెటజ్ అనలైజ్ దిస్ డైలాగ్. ప్రశ్న అడిగినవాడు పృచ్ఛకుడు, జవాబు చెప్పినవాడు కవి.

* * *
కేస్ 1.
పృచ్ఛకుడికి పనీ పాటా లేదు. ఎవరేం చేస్తున్నారో ఆరాలు తీస్తుంటాడు. కెలికి కూపీ లాగుతుంటాడు. కవి దగ్గర చాలా ఊసులున్నాయి. పాపం అతని తల పగిలిపోతోంది అవి పట్టక! అందుకని ఏ ‘స్కేప్ గోట్’ దొరుకుతారా, వాళ్ళ మీద అవి ప్రయోగించి తన భారం వదిలించుకుందామా అని చూస్తుంటాడు. కవిగారి ధాటికి ఆకులన్నీ రాలిపోయి, పూలన్నీ ఎగిరిపోయాయి! ఒంటరి గడ్డి పువ్వు తప్పించుకోలేదు, బలహీనురాలు అనుకొని దాని మీదకి వెళ్తున్నాడు. దారిలో పృచ్ఛకుడు అడ్డగించాడు. కొన్ని ఊసులు పృచ్ఛకుడి మీద కూడా వెదజల్లుతాడు ఇక.
* * *
కేస్ 2.
పృచ్ఛకుడు పేదవాడు. అతని దగ్గర కాసులే కాదు, ఊసులు కూడా లేవు. దారిన పోయే కవిగారి దోసిలి నిండా ఊసులు చూసేసరికి అతనికి ఆశ పుట్టింది. తనకీ కొన్ని ఇస్తాడేమో, మోడువారిన జీవితంలో ఊసులవర్షం కురిపిస్తాడేమోనని ఉబలాటపడ్డాడు. కవి ఐడియలిస్టు. అతనికి మనుషులతో పని లేదు. తన లోకంలో ఆలోచనలు తింటూ బతుకుతుంటాడు. పచ్చటి పైరులాంటిదతని మెదడు. అక్కడ ధాన్యం సమృద్ధిగా పండుతుంది. కానీ ఆ ఆశయాలని, ఆలోచనలని ఎవరికీ పంచటానికి ఇష్టపడడు. బుర్రలో మురిగిపోయినపుడు మాత్రం ఒంటరి గడ్డి పూలకైనా ఇస్తాడు కానీ మనుషులకి మాత్రం ఇవ్వడు.
* * *
కేస్ 3.
పృచ్ఛకుడు ఐటి ఆఫీసర్. కవి గుప్తనిధులున్న పౌరుడు. స్విస్ బ్యాంకు కి తీసుకెళ్తున్న ఊసుల్ని దారిలో ఎవరూ లేరులే అన్న ధైర్యంతో సూట్ కేసులో కాకుండా ఓపెన్ గా  దోసిలిలో పట్టుకెళుతూ రెడ్ హాండెడ్ గా దొరికిపోయాడు. అందుకే తప్పించుకోడానికి “నేను ఎవరికీ దోచి పెట్టట్లేదు, దాచి పెట్టట్లేదు, పేద గరిక పూలని ఉద్ధరించటానికి బయలుదేరాన “న్నాడు.  పృచ్ఛకుడు నమ్మినట్టే ఉన్నాడు! ఇద్దరూ అద్భుతంగా
నటించగలరు.
* * *
కేస్ 4.
పృచ్ఛకుడు తెలివైనవాడు. రొమాంటిసిస్ట్. తనకు కలిగేలాంటి ఆలోచనలే ఇంకెవరికైనా కలుగుతాయా అని చిన్న చిన్న ‘ప్రాక్టికల్  మైండ్ గేమ్స్’ ఆడుతుంటాడు. అందుకే పొయెటిక్ గా ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు ఎదుటి వారు సమాధానం చెప్పలేరని అతనికి ఒక నమ్మకం. కవి మాత్రం తక్కువ తిన్నాడా? అంతే ఊపుతో పృచ్ఛకుడి పీచమణిగేలా జవాబు చెప్పాడు- నరసకవి కి బుద్ధి చెప్పిన తెనాలి రామకృష్ణుడి లాగా !

* * *
కేస్ 5. (ఐడియల్ అండ్ ఇంపోసిబుల్ కేస్)
పృచ్ఛకుడు నిజంగా పృచ్ఛకుడే, కవి నిజంగా కవే! ప్రశ్నించే గుణం ఉంటే జవాబు చెప్పాల్సిన వాళ్ళు బాధ్యతగా నడుచుకుంటారు; వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది అని నమ్ముతాడు పృచ్ఛకుడు. అతనికి “నీ కవిత్వంతో  నాకేం ఒరుగుతుందో చెప్పు” అని ఒక పాఠకుడిగా కవిని దబాయించే హక్కు ఉంటుంది. భావ సంపద, అనుభవ సంపదా ఉంటుంది కవికి. సామాజిక చైతన్యం కోసం దాన్ని వాడిన నాడే అది నిజమైన కవిత్వం అనిపించుకుంటుంది అని కవికి తెలుసు. కవి ఏ దారిలో వెళ్తున్నాడో తెలుసుకున్న పృచ్ఛకుడు అతను దారి తప్పకుండా చూసుకోగలడు. ఇద్దరూ ఒకరికొకరు తోడ్పడే స్వభావం కలవారు, తద్వారా జీవనాన్ని వెలిగించుకోగలరు!

* * *
ఏమీ లేని విషయాన్ని మసి పూసి మారేడు కాయ చేసి అధ్యయనం చేయగలిగితే మాస్టర్ డిగ్రీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ తొందరగా వస్తుంది. ఇప్పటి మార్కెట్ వేల్యూ స్టడీ చేసి భవిష్యత్తు బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలో చెప్పేదే ఎంబీఏ.  అది అందరికీ సూట్ కాదు. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి.
----------

-- మోహిత
For ‘Vibrations’