Wednesday 10 July 2013

ఆ నలుగురు


అగ్గిపెట్టె లాంటి ఆ ఇంట్లో అగ్గిపుల్లలు ఐదు.
సగం విరిగిన అగ్గిపుల్లలాంటి ఓ ముసలాయన. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అగ్గిపుల్ల లాంటి ఓ చిన్న పిల్లాడు. ఒక్కసారి గియ్యగానే భగ్గున మండిపోయే అగ్గిపుల్లలాంటి ఓ చలాకీ పడుచు పిల్ల. తలలంటుకుపోయిన అగ్గిపుల్లల్లా జీవితాలు అతుక్కుపోయిన ఓ మొగుడూ పెళ్ళాం!
        వీళ్ళలో నలుగురు రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నర కొట్టేప్పటికి పెట్టెలోంచి బైట కొస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ముసలాయన ఓపికుంటే పెట్టె తోసుకొని బయట పడతాడు, లేకపోతే హాల్లో కిటికీలోంచి పెట్టె బయట ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటాడు. రాత్రి పదయ్యేసరికి మిగతా నలుగురూ క్షేమంగా పెట్టెలోకి చేరుకుంటారు. ఇది క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం. నదులని సముద్రం కలిపినట్టు వాళ్ళని ఆ పెట్టె కలుపుతూ ఉంటుంది.
  
     ఒకరోజు ముసలాయన పెట్టె కిటికీలోంచి బయటకు చూస్తుంటే కనపడ్డాయి నాలుగు దృశ్యాలు. 1) మనవరాలు ఎవరో కుర్రాడి పల్సర్ బైక్ మీంచి దిగింది.  2) మనవడు నలుగురు క్లాస్ మేట్స్
కూర్చున్న యాక్టివా బండి మీంచి దిగాడు. 3) కోడలు కంపెనీ ఇండికా కార్లోంచి దిగి ఎవరికో చేతులూపింది. 4) కొడుకు పక్కింటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు కాబోలు - ముందు ఆ గేటు ముందాగి తర్వాత తమ ఇంటి ముందాగింది స్ప్లెండర్.
      పెట్టె ఒకటే అయినా ఏ పుల్ల దారి ఆ పుల్ల చూసుకుంటోందని అర్థమైంది ముసలి పుల్లకి.
కనీసం రాత్రికి పుల్లలన్నీ ఇంటికి చేరుతున్నందుకు సంతోషించాడు. గోడ మీద క్యాలెండర్ వంక చూసి ఎవరికేరోజు క్లాసు పీకాలో డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు.


   మనవడి దగ్గర్నుంచీ మొదలై వయసు ఆరోహణ క్రమంలో క్లాసులు పూర్తయ్యాయి. పెర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్ మెంట్ లేదని, ఇటువంటి తరగతులు ప్రతి నెలా పెట్టాలని ఆయన డిసైడయ్యాడు. తన వయసులో కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత నిర్వర్తించాలని ఆయన గుర్తించాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుకొని సరిపెట్టుకున్నారు.
  
    ఎంసెట్ దగ్గర పడే కొద్దీ కోచింగ్ ఇంటెన్సిటీ పెరిగినట్టు, ఈయనకు టైం దగ్గర పడే కొద్దీ క్లాసులు ఎక్కువై పోయాయి.  కొన్నాళ్ళ తరువాత పెట్టెలో నాలుగు పుల్లలే మిగిలాయి.

    నలుగురూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన నియంత్రించే పెద్ద తలకాయ లేకుండా పోయింది. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోవడం రావడం చేసేవారు. దానికి తోడు మొబైల్ ఫోన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దాడి చేశాయి. ఈ చిన్న పెట్టె సరిపోవడం లేదనిపించింది. కోరికలు గుర్రాలయ్యాయి. ఆ గుర్రాలకి రెక్కలొచ్చాయి. గాలి వాటానికి రెక్కలెటు తీసుకెళ్తే అటు ఎగిరి పోయారు ఆ నలుగురూ. పెట్టె ఈ మధ్య ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటోంది.
 
       పెట్టె నలుగుర్నీ దగ్గర చేసేది. ఐదో అగ్గిపుల్ల వల్ల ఆ దగ్గరితనం సాధ్యమయ్యేది.


     ఇప్పుడు దృక్పథం మారింది. విశాలమైన వాకిళ్ళూ పడక గదులూ ఉంటే బాగుండే దనుకున్నారు. అవి సాధించు కోవడానికి , రాత్రికి రాత్రి కలలు నిజం చేసుకోవడానికి పూనుకున్నారు. షార్ట్ కట్ లో ప్రయాణించారు. చరిత్ర అడ్డదారులు తొక్కద్దని చెప్తూనే ఉంటుంది. మనుషులు చరిత్రను పునరావృతం చేస్తూనే ఉంటారు. చెప్పిన క్లాసులే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటారు. కవరైన పోర్షనే మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తారు. వాళ్లకు విశాలంగా ఉండాల్సింది ఇల్లు కాదు, హృదయం అని  అర్థమవుతుంది. కలకాలం ఉండాల్సింది బంధాలు, బాంధవ్యాలు అని అర్థమవుతుంది. కానీ అప్పటికే అగ్గిపుల్ల కాలి బూడిదైపోతుంది.


-మోహిత
For ‘Vibrations’

No comments:

Post a Comment