Thursday, 1 August 2013

దిగంబర రహస్యం


యునెస్కో ప్రతినిధులు  ఇండియాలోని చారిత్రక కట్టడాల లిస్ట్ తయారు చేస్తూ హైదరాబాద్ చేరుకున్నారు. అణువణువూ జల్లెడ పట్టి చరిత్రని వెలికి తీయాలని జల్లెడలు పట్టుకొని ఒక పాత ప్రహరీ గోడ దగ్గరికి వచ్చారు. వాళ్ళ దగ్గరున్న యంత్రాలతో పరీక్షించి చూస్తే అది చైనా వాల్ కన్నా చాలా గట్టిగా ఉందని తేలింది. ఆఫీసర్లు ఆశ్చర్యంతో తలమునకలయ్యారు. డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ ని సంప్రదించారు. ఆయనేమో తన హయాంలో గానీ కులీ కుతుబ్ షా హయాం లో గానీ అలాంటి గోడే కట్టించలేదని మ్యూజియం గోడ గుద్ది  చెప్పాడు. ఆ గోడ కట్టటానికి ఏయే పదార్థాలు వాడారో తెలుసుకోవటానికి దాని మీది సున్నం గీరి కెమికల్ ఎనాలిసిస్ కు పంపించారు. గోడకి కాపలాగా ఇద్దరు సెంట్రీలని పెట్టారు.


*  *  *
రాత్రి ఒంటిగంట.
ఒక ముసుగు మనిషి పలుగూ పారలతో ఆ గోడ దగ్గర తచ్చాడుతూ సెంట్రీ ల చేతికి చిక్కాడు. ‘అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గోడను కూల్చే దురుద్దేశం తోనే అక్కడికి వచ్చాడ’నే అభియోగం మోపబడింది. 
మరుసటి రోజు కోర్టులో “ నేను కొంపా గోడా కూల్చే రకం గాదండి! కిందున్న మట్టి కోసమే ఒచ్చాను”  అని మొత్తుకున్నాడు.
“మట్టి అక్రమ రవాణా కేసు బుక్ చేద్దామ”న్నాడు పీపీ.
“అతను మట్టి పిసుక్కునేవాడు , వదిలేద్దాం“ అన్నాడు డిఫెన్సు.
“ఇంతకీ ఆ మట్టి ఎందుక”న్నారు జడ్జిగారు.
“ అయ్యా! తవరు ఇంటానంటే కేసులు గీసులు ఎయ్యనంటే నిజం సెప్తానండయ్య “
“భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. కేసు సంగతి నేను చూసుకుంటా“
“సత్తె పెమాణకంగా, ఈ మట్టి మొక్కలకేత్తానండయ్య! అయి ఏపుగా ఎదిగి పూటుగా కాయలిత్తయండయ్య !”
“నువ్వు మొక్కల్ని పెంచే నేలలో సారం లేకపోతే ఎరువులెయ్యాలి గానీ మట్టెయ్యడమేంటి ?”
“అయ్యన్నీ కల్తీ ఎరువులండయ్య . ఈ మట్టిలో నూటికి రొండొందల శాతం కల్తీ ఉండదయ్య ! కావాలంటే పరీచ్చ జేపిచ్చుకోండి”

మట్టిని కూడా కెమికల్ ఎనాలిసిస్ కి  పంపారు.
*  *  *
రెండింటి రిపోర్టులు వచ్చాయి.

“నాకు నమ్మశక్యం కావటం లేదు డైరెక్టర్ గారూ. ఇట్స్ ఇంపాజిబుల్ “ అన్నాడు యునెస్కో ప్రతినిధి. ఆర్కియాలజీ డైరెక్టర్ తల పట్టుకు కూర్చున్నాడు. ఈ గోడ మన దేశాన్ని ఏ లెవెల్ కి తీసుకెళ్ళిందో తేల్చుకోలేక గోడ మీద పిల్లిలా సతమతమవుతున్నాడు.
“గోడ మీదకి యూరియా ఎలా వచ్చింది?” ఆ అడగటం అచ్చం యమలీల సినిమా లో బ్రహ్మానందం “ఆవు గోడ మీదకెక్కి అక్కడ పేడెలా వేసింది?” స్టైల్లో ఉంది.
“నాకేం అర్థం కావటం లేదు. డిటెక్టివ్ యుగంధర్ ని పిలిపిద్దాం”


*  *  *
యుగంధర్ ఆ రోజే రంగం లోకి దిగాడు. మట్టి, గోడ - రెండింటి మీదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. ఎన్నిబస్తాల యూరియా వేస్తే ఇంత సారవంతమైన ఎరువు వస్తుంది లాంటి లెక్కలు కట్టాడు. ఇటుక బట్టీల వెంబడి, సిమెంట్ ఫ్యాక్టరీల వెంబడి, సున్నం  తయారు చేసే చోట్లకీ తిరిగి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఒకే చోట ఇంత యూరియా మాత్రం అసాధ్యం అని తేలింది. ఈ రహస్యం ఛేదించాలంటే గోడకున్న పటిష్ఠమైన కాపలా తొలగించాలని కోరాడు.

*  *  *

అప్పటికి రెండు నిమిషాలైంది కాపలా వాళ్ళు వెళ్లి పోయి. యుగంధర్ ఒక చెట్టు చాటున నక్కి చూస్తున్నాడు. ఒకాయన అటుగా నడుస్తూ వెళ్తున్నాడు. గోడని చూడగానే ఏదో గుర్తొచ్చినట్టు ఠపీమని ఆగిపోయాడు. ప్యాంటు జిప్ తీశాడు. గోడ వైపు తిరిగి  పని కానిచ్చి ఏమెరగనట్టు వెళ్ళిపోయాడు. రెండు గంటలు గడిచేసరికి రెండొందలమందిని లెక్క పెట్టాడు యుగంధర్! అవాక్కయ్యాడు! తన ఎసైన్మెంట్స్ దృష్ట్యా ఎక్కువ విదేశాల్లోనే గడపటం వల్ల
భారతీయులకి ఇలాంటి అలవాటు ఉంటుందని అసలు తెలీకుండా పోయింది.

  ఇంతలో ఒకబ్బాయి వచ్చి పొజిషన్ లో నుంచొని కుడి చేత్తో ముక్కు మూసుకొని మరీ తల పైకెత్తి ఈల వేస్తూ గోడమీద డిజైన్లు వెయ్యడం యుగంధర్ తట్టుకోలేక పోయాడు. ఒక్కంగలో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్దామని కాలు వేశాడో లేదో అది కాస్తా అక్కడి బురదలో కూరుకు పోయింది!
“కొంచెం చూసుకోవాలి బ్రదర్ “ అని ఆ అబ్బాయి ఉచిత సలహా పారేసి తన దారిన చక్కాపోయాడు.
తోటి భారతీయుణ్ణి ఏమని తిట్టాలో తెలీక యుగంధర్  తంటాలుపడి బయటపడి గోడ మీదకి యూరియా ఎలా చేరిందో, అంటు వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికనిచ్చి పర్మనెంటుగా సింగపూర్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.

ఇదీ యుగంధర్ శోధించిన దిగంబర రహస్యం!

యునెస్కో ప్రతినిధులు మాత్రం చాలా చోట్ల చెప్పుల దండలు కట్టిన గోడల్ని చూస్తూ గోడలకి చెప్పులెందుకబ్బా,  అవి నడవ లేవు కదా అని ఆశ్చర్యపోతూనే ఉన్నారు!



-మోహిత


For ‘Vibrations’

Wednesday, 10 July 2013

ఆ నలుగురు


అగ్గిపెట్టె లాంటి ఆ ఇంట్లో అగ్గిపుల్లలు ఐదు.
సగం విరిగిన అగ్గిపుల్లలాంటి ఓ ముసలాయన. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అగ్గిపుల్ల లాంటి ఓ చిన్న పిల్లాడు. ఒక్కసారి గియ్యగానే భగ్గున మండిపోయే అగ్గిపుల్లలాంటి ఓ చలాకీ పడుచు పిల్ల. తలలంటుకుపోయిన అగ్గిపుల్లల్లా జీవితాలు అతుక్కుపోయిన ఓ మొగుడూ పెళ్ళాం!
        వీళ్ళలో నలుగురు రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నర కొట్టేప్పటికి పెట్టెలోంచి బైట కొస్తారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ముసలాయన ఓపికుంటే పెట్టె తోసుకొని బయట పడతాడు, లేకపోతే హాల్లో కిటికీలోంచి పెట్టె బయట ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటాడు. రాత్రి పదయ్యేసరికి మిగతా నలుగురూ క్షేమంగా పెట్టెలోకి చేరుకుంటారు. ఇది క్రమం తప్పకుండా జరిగే వ్యవహారం. నదులని సముద్రం కలిపినట్టు వాళ్ళని ఆ పెట్టె కలుపుతూ ఉంటుంది.
  
     ఒకరోజు ముసలాయన పెట్టె కిటికీలోంచి బయటకు చూస్తుంటే కనపడ్డాయి నాలుగు దృశ్యాలు. 1) మనవరాలు ఎవరో కుర్రాడి పల్సర్ బైక్ మీంచి దిగింది.  2) మనవడు నలుగురు క్లాస్ మేట్స్
కూర్చున్న యాక్టివా బండి మీంచి దిగాడు. 3) కోడలు కంపెనీ ఇండికా కార్లోంచి దిగి ఎవరికో చేతులూపింది. 4) కొడుకు పక్కింటి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు కాబోలు - ముందు ఆ గేటు ముందాగి తర్వాత తమ ఇంటి ముందాగింది స్ప్లెండర్.
      పెట్టె ఒకటే అయినా ఏ పుల్ల దారి ఆ పుల్ల చూసుకుంటోందని అర్థమైంది ముసలి పుల్లకి.
కనీసం రాత్రికి పుల్లలన్నీ ఇంటికి చేరుతున్నందుకు సంతోషించాడు. గోడ మీద క్యాలెండర్ వంక చూసి ఎవరికేరోజు క్లాసు పీకాలో డేట్లు ఫిక్స్ చేసుకున్నాడు.


   మనవడి దగ్గర్నుంచీ మొదలై వయసు ఆరోహణ క్రమంలో క్లాసులు పూర్తయ్యాయి. పెర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్ మెంట్ లేదని, ఇటువంటి తరగతులు ప్రతి నెలా పెట్టాలని ఆయన డిసైడయ్యాడు. తన వయసులో కుటుంబ విలువలను కాపాడాల్సిన బాధ్యత నిర్వర్తించాలని ఆయన గుర్తించాడు. మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనుకొని సరిపెట్టుకున్నారు.
  
    ఎంసెట్ దగ్గర పడే కొద్దీ కోచింగ్ ఇంటెన్సిటీ పెరిగినట్టు, ఈయనకు టైం దగ్గర పడే కొద్దీ క్లాసులు ఎక్కువై పోయాయి.  కొన్నాళ్ళ తరువాత పెట్టెలో నాలుగు పుల్లలే మిగిలాయి.

    నలుగురూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన నియంత్రించే పెద్ద తలకాయ లేకుండా పోయింది. ఎవరిష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోవడం రావడం చేసేవారు. దానికి తోడు మొబైల్ ఫోన్ల లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు దాడి చేశాయి. ఈ చిన్న పెట్టె సరిపోవడం లేదనిపించింది. కోరికలు గుర్రాలయ్యాయి. ఆ గుర్రాలకి రెక్కలొచ్చాయి. గాలి వాటానికి రెక్కలెటు తీసుకెళ్తే అటు ఎగిరి పోయారు ఆ నలుగురూ. పెట్టె ఈ మధ్య ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటోంది.
 
       పెట్టె నలుగుర్నీ దగ్గర చేసేది. ఐదో అగ్గిపుల్ల వల్ల ఆ దగ్గరితనం సాధ్యమయ్యేది.


     ఇప్పుడు దృక్పథం మారింది. విశాలమైన వాకిళ్ళూ పడక గదులూ ఉంటే బాగుండే దనుకున్నారు. అవి సాధించు కోవడానికి , రాత్రికి రాత్రి కలలు నిజం చేసుకోవడానికి పూనుకున్నారు. షార్ట్ కట్ లో ప్రయాణించారు. చరిత్ర అడ్డదారులు తొక్కద్దని చెప్తూనే ఉంటుంది. మనుషులు చరిత్రను పునరావృతం చేస్తూనే ఉంటారు. చెప్పిన క్లాసులే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటారు. కవరైన పోర్షనే మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తారు. వాళ్లకు విశాలంగా ఉండాల్సింది ఇల్లు కాదు, హృదయం అని  అర్థమవుతుంది. కలకాలం ఉండాల్సింది బంధాలు, బాంధవ్యాలు అని అర్థమవుతుంది. కానీ అప్పటికే అగ్గిపుల్ల కాలి బూడిదైపోతుంది.


-మోహిత
For ‘Vibrations’

Wednesday, 3 July 2013

ఎం. బి. ఏ చదువులు

ఎం. బి. ఏ చదువులు

“దోసిలి నిండా ఊసులని ఎక్కడికీ తీసుకెళుతున్నావ్ ?”
“అదిగో, ఆ దిబ్బ మీద ఒంటరి పువ్వు కిద్దామని !”

* * *
లెటజ్ అనలైజ్ దిస్ డైలాగ్. ప్రశ్న అడిగినవాడు పృచ్ఛకుడు, జవాబు చెప్పినవాడు కవి.

* * *
కేస్ 1.
పృచ్ఛకుడికి పనీ పాటా లేదు. ఎవరేం చేస్తున్నారో ఆరాలు తీస్తుంటాడు. కెలికి కూపీ లాగుతుంటాడు. కవి దగ్గర చాలా ఊసులున్నాయి. పాపం అతని తల పగిలిపోతోంది అవి పట్టక! అందుకని ఏ ‘స్కేప్ గోట్’ దొరుకుతారా, వాళ్ళ మీద అవి ప్రయోగించి తన భారం వదిలించుకుందామా అని చూస్తుంటాడు. కవిగారి ధాటికి ఆకులన్నీ రాలిపోయి, పూలన్నీ ఎగిరిపోయాయి! ఒంటరి గడ్డి పువ్వు తప్పించుకోలేదు, బలహీనురాలు అనుకొని దాని మీదకి వెళ్తున్నాడు. దారిలో పృచ్ఛకుడు అడ్డగించాడు. కొన్ని ఊసులు పృచ్ఛకుడి మీద కూడా వెదజల్లుతాడు ఇక.
* * *
కేస్ 2.
పృచ్ఛకుడు పేదవాడు. అతని దగ్గర కాసులే కాదు, ఊసులు కూడా లేవు. దారిన పోయే కవిగారి దోసిలి నిండా ఊసులు చూసేసరికి అతనికి ఆశ పుట్టింది. తనకీ కొన్ని ఇస్తాడేమో, మోడువారిన జీవితంలో ఊసులవర్షం కురిపిస్తాడేమోనని ఉబలాటపడ్డాడు. కవి ఐడియలిస్టు. అతనికి మనుషులతో పని లేదు. తన లోకంలో ఆలోచనలు తింటూ బతుకుతుంటాడు. పచ్చటి పైరులాంటిదతని మెదడు. అక్కడ ధాన్యం సమృద్ధిగా పండుతుంది. కానీ ఆ ఆశయాలని, ఆలోచనలని ఎవరికీ పంచటానికి ఇష్టపడడు. బుర్రలో మురిగిపోయినపుడు మాత్రం ఒంటరి గడ్డి పూలకైనా ఇస్తాడు కానీ మనుషులకి మాత్రం ఇవ్వడు.
* * *
కేస్ 3.
పృచ్ఛకుడు ఐటి ఆఫీసర్. కవి గుప్తనిధులున్న పౌరుడు. స్విస్ బ్యాంకు కి తీసుకెళ్తున్న ఊసుల్ని దారిలో ఎవరూ లేరులే అన్న ధైర్యంతో సూట్ కేసులో కాకుండా ఓపెన్ గా  దోసిలిలో పట్టుకెళుతూ రెడ్ హాండెడ్ గా దొరికిపోయాడు. అందుకే తప్పించుకోడానికి “నేను ఎవరికీ దోచి పెట్టట్లేదు, దాచి పెట్టట్లేదు, పేద గరిక పూలని ఉద్ధరించటానికి బయలుదేరాన “న్నాడు.  పృచ్ఛకుడు నమ్మినట్టే ఉన్నాడు! ఇద్దరూ అద్భుతంగా
నటించగలరు.
* * *
కేస్ 4.
పృచ్ఛకుడు తెలివైనవాడు. రొమాంటిసిస్ట్. తనకు కలిగేలాంటి ఆలోచనలే ఇంకెవరికైనా కలుగుతాయా అని చిన్న చిన్న ‘ప్రాక్టికల్  మైండ్ గేమ్స్’ ఆడుతుంటాడు. అందుకే పొయెటిక్ గా ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు ఎదుటి వారు సమాధానం చెప్పలేరని అతనికి ఒక నమ్మకం. కవి మాత్రం తక్కువ తిన్నాడా? అంతే ఊపుతో పృచ్ఛకుడి పీచమణిగేలా జవాబు చెప్పాడు- నరసకవి కి బుద్ధి చెప్పిన తెనాలి రామకృష్ణుడి లాగా !

* * *
కేస్ 5. (ఐడియల్ అండ్ ఇంపోసిబుల్ కేస్)
పృచ్ఛకుడు నిజంగా పృచ్ఛకుడే, కవి నిజంగా కవే! ప్రశ్నించే గుణం ఉంటే జవాబు చెప్పాల్సిన వాళ్ళు బాధ్యతగా నడుచుకుంటారు; వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది అని నమ్ముతాడు పృచ్ఛకుడు. అతనికి “నీ కవిత్వంతో  నాకేం ఒరుగుతుందో చెప్పు” అని ఒక పాఠకుడిగా కవిని దబాయించే హక్కు ఉంటుంది. భావ సంపద, అనుభవ సంపదా ఉంటుంది కవికి. సామాజిక చైతన్యం కోసం దాన్ని వాడిన నాడే అది నిజమైన కవిత్వం అనిపించుకుంటుంది అని కవికి తెలుసు. కవి ఏ దారిలో వెళ్తున్నాడో తెలుసుకున్న పృచ్ఛకుడు అతను దారి తప్పకుండా చూసుకోగలడు. ఇద్దరూ ఒకరికొకరు తోడ్పడే స్వభావం కలవారు, తద్వారా జీవనాన్ని వెలిగించుకోగలరు!

* * *
ఏమీ లేని విషయాన్ని మసి పూసి మారేడు కాయ చేసి అధ్యయనం చేయగలిగితే మాస్టర్ డిగ్రీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ తొందరగా వస్తుంది. ఇప్పటి మార్కెట్ వేల్యూ స్టడీ చేసి భవిష్యత్తు బిజినెస్ ని ఎలా డెవలప్ చేయాలో చెప్పేదే ఎంబీఏ.  అది అందరికీ సూట్ కాదు. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి.
----------

-- మోహిత
For ‘Vibrations’





Wednesday, 26 June 2013

సైన్స్ అండ్ టెక్నాలజీ

సైన్స్ అనగానే టెక్నాలజీ అనే పదం కూడా మస్తిష్కం లో మెదులుతుంది. ఈ మధ్య కుప్పలు తెప్పలు గా  వచ్చిపడుతున్న కొత్త కొత్త కోర్సుల పేర్లు వింటుంటే వింతగా ఉంటుంది. ఇది విజ్ఞాన శాస్త్రమేనా అని అబ్బురపరిచే ఎన్నో రకాల పరిశోధనలు, వాటి ఫలితాలు  వెలుగు లోకి వస్తున్నాయి. అసలు సైన్స్ science  అంటే ఏమిటి? టెక్నాలజీ technology  అంటే ఏమిటి? ఈ రెండిటికీ తేడా ఏమిటి? ఇవన్నీ ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
    
‘సైన్స్’ అంటే బ్రౌణ్య నిఘంటువు ప్రకారం ‘శాస్త్రము’ అని అర్థం.వాడుక భాషలో విజ్ఞాన శాస్త్రము లేదా ప్రయోగ శాస్త్రంగా అర్థం చేసుకుంటూ ఉంటాం. సైన్స్ అంటే శాస్త్రము కాబట్టి ఈ పదాన్ని వేర్వేరు పదాలకు జోడించి కూడా వాడుతుంటారు. ఉదాహరణకు సాంఘిక శాస్త్రం (social sciences ), రాజకీయ శాస్త్రము (political sciences ), గణిత శాస్త్రము (mathematical sciences ), జీవ శాస్త్రము (life sciences ), మనస్తత్వ శాస్త్రము (psychological sciences ) వంటివి. ఇక నిర్వచనం చెప్పాలంటే “ సైన్స్ అనేది వరుస చర్యల ద్వారా ఎటువంటి ఫలితం వస్తుందో  తెలుసుకోవడానికి ఉపయోగపడే క్రమానుగుణ  జ్ఞాన సర్వస్వం.” అంటే సైన్స్ ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఉన్న జ్ఞానాన్ని పెంచుకుంటూ పోవడమే సైన్స్ లక్ష్యం. ఊహ, సృజన- ఈ రెండూ సైన్స్ లో చాలా ముఖ్యం.ఒకసారి నిర్వచిచబడిన అర్థం ఆధారంగా కొత్త నిర్వచనాలు సృష్టించబడతాయి. కొత్త సిద్ధాంతాలు  కనుగొన బడ తాయి.

   ‘టెక్నాలజీ’ అంటే కూడా సైన్సే . సాంకేతిక శాస్త్రము అనేది తెలుగు అనువాదం. తెలుసుకున్న విషయాన్ని ఒక ఉపకరణం ద్వారా మానవులకు ఉపయోగపడే విధానంగా రూపొందించ డాన్ని ‘టెక్నాలజీ’ అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే , అనువర్తిత శాస్త్రం అవుతుంది. జ్ఞానాన్ని, ఉపకరణాలను (సాధనాలను) ఉపయోగించి ఒక ప్రత్యేక  శాస్త్రాన్ని , నిర్దిష్ట శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి టెక్నాలజీ ని ఉపయోగిస్తారు.

‘అప్లైడ్ సైన్స్’(applied science ) అని ఇంకోటి ఉంది. శాస్త్ర జ్ఞానాను వర్తనం  చేసేది అప్లైడ్ సైన్స్. కాబట్టి టెక్నాలజీ అంటే అప్లైడ్ సైన్సే . టెక్నాలజీ లో సాంకేతికత, ఉపకరణాల వాడకం ఎక్కువగా ఉంటుంది.

వివరణ, సాధార ణీ కరణ , సిద్ధాంతాల రూప కల్పనా - ఇవి శాస్త్రం యొక్క ప్రధాన లక్షణములు. ఆ సిద్ధాంతాలకు వివరణా , సమన్వయమూ  కల్పించి ఒక భౌతిక ఆకారాన్ని కల్పించడం సాంకేతికత.  పరిశోధనలు సైన్సును నియంత్రిస్తాయి. నూతన కల్పనలు, డిజైన్లు , ఉత్పత్తులు టెక్నాలజీ ని నియంత్రిస్తాయి.

మీరు సైన్స్ లో రాణించాలంటే పరిశోధక , తర్క గుణాల్లో  (experimental  and logical skills ) ప్రవీణులై ఉండాలి. అదే  టెక్నాలజీ లో రాణించాలంటే  వస్తు నిర్మాణం , డిజైన్ , నాణ్యతా ప్రమాణాలు పరీక్షించుట  సమస్యలు పరిష్కరించుట (design, construction, testing, quality assurance and problem-solving) వంటి వాటిలో ప్రవీణులై ఉండాలి.

ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే  ఏ కోర్సు లో జాయిన్ అవ్వాలి అనే సందేహం అందరికీ ఉంటుంది. ఉదాహరణకు బీఎస్సీ కంప్యూటర్స్ , బీటెక్ కంప్యూటర్స్  ఉన్నాయి. ఈ రెండిటి లో ఏది మంచిది అని మీరు మీ స్నేహితులనో తెలిసిన వాళ్లనో  అడుగుతారు. దానికి వాళ్ళు తోచిన విధంగా  సమాధానం చెబుతారు. కొంత మంది దేని విలువ దానిదే అని కూడా చెప్తారు. మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?  కేవలం మన సామర్ధ్యము, నేర్పు ఏ విషయంలో ఎక్కువ ఉన్నాయో ఆ విధం గా కోర్స్ ని సెలక్ట్ చేసుకోవాలి.

ఇంకా  ఫైనల్ ఇయర్ విద్యార్థులంతా ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తూ ఉండి ఉంటారు. ప్రాజెక్ట్ అనేది టెక్నికల్ ఆ సైంటిఫిక్ ఆ అనేది ఎలా తెలుసుకుంటాం? ఉత్సుకత మాత్రమే మీరు ఆ టాపిక్ ఎంచుకోవటానికి కారణం అయితే అది సైంటిఫిక్. కాదు, నా ప్రాజెక్ట్ వల్ల పది మంది కి ఉపయోగం ఉంది అంటే అది టెక్నికల్. ఒక పరికల్పన ఆధారంగా లేదా పరికల్పనను తప్పు అని నిరూపించడానికి మీరు ప్రాజెక్ట్ మొదలు పెట్టారా?అయితే అది సైంటిఫిక్. ఒక ఉత్పత్తి లేక విధానం అభివృద్ధి చేయడానికి మీరు మోడల్స్, డిజైన్లు వేస్తున్నారా? అయితే అది టెక్నికల్.

సింపుల్ గా చెప్పాలంటే  సైన్స్ అంటే తెలుసుకోవడం, టెక్నాలజీ అంటే పని చేయడం. వచ్చే నెల కొన్ని కోర్సుల వివరాలతో కలుసుకుందాం. సెలవు.

                                                                                                                  --  మోహిత
తెలుగు హరివిల్లు

1. అమ్మన్నా అయ్యన్నా తెలుగు
పంతులయ్య పంతులమ్మ తెలుగు
అత్తన్నా మామన్నా తెలుగు
అమ్మమ్మా తాతయ్యా తెలుగే !

2.రామయ్య సీతమ్మా తెలుగు
ఏడుకొండల వెంకన్నా తెలుగు
ఏసన్నా  ఈసా అన్నా తెలుగు
బుద్ధ దేవుడన్నా మరి తెలుగే !

3.నన్నయ్య తిక్కన్నా తెలుగు
అన్నమయ్య త్యాగరాజు తెలుగు
వేమన్న బద్దెనా తెలుగు
విశ్వనాథ సింగిరెడ్డి తెలుగే !

4.రుద్రమ్మా చానమ్మా తెలుగు
దుగ్గిరాల దుర్గాబాయి తెలుగు
పింగళి అల్లూరి  తెలుగు
ఊటుకూరు టంగుటూరి తెలుగే !

5.చిలకమర్తి గిడుగువారు తెలుగు
కందుకూరి గురజాడ తెలుగు
శ్రీరంగం జాషువా తెలుగు
రావూరి వాసిరెడ్డి తెలుగే !

6. మోక్షగుండం  కేయల్రావు తెలుగు
యల్లాప్రగడ నాయుడమ్మ తెలుగు
గ్రంథి వారు పుల్లారెడ్డి తెలుగు
చందనా రామోజీ తెలుగే !

7. రైతన్నా కూలన్నా తెలుగు
గ్రామ పెద్దన్నా కాపన్నా తెలుగు
కమ్మరన్న కుమ్మరన్న తెలుగు
పూలమ్మి పూజారయ్య తెలుగే !

8.అంజలమ్మ సావిత్రమ్మ తెలుగు
సూర్యకాంతమ్మ జానకమ్మ తెలుగు
వాణిశ్రీ జయసుధమ్మ తెలుగు
విజయశాంతైనా శ్రీదేవైనా తెలుగే !

9. ఎన్టీవోడు ఏయన్నారు తెలుగు
శోభనాద్రైనా కృష్ణయినా తెలుగు
చిరంజీవి వెంకటేషు తెలుగు
నాగార్జున మహేషన్న తెలుగే !

10.తానా అన్నా తందానా అన్నా తెలుగు
వంశీ అన్నా వంగూరన్నా తెలుగు
ఇంతెందుకు మనమంతా తెలుగు
మన తెలుగే ఇక వెలగాలొక వెలుగు
ఇరుగు పొరుగు చూస్తే ఆ జిలుగు
లేనే లేదంటారు మనకు తిరుగు!



ఈ పాట లవకుశ సినిమా లో “అశ్వమేధ యాగానికి జయము “ అనే పాట రాగం లో కూర్చబడినది.  రాగం కోసం ప్రతి పాదం లో ‘తెలుగు’ అన్న పదాన్ని మూడు సార్లు పలుకవలసి ఉంటుంది.
అమ్మ

Sunday, 9 June 2013

కాలా పానీ


ఈ మధ్య హాస్పిటల్ సీన్ తో మొదలైన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కారణంగా ఈసారి వైబ్రేషన్స్ కూడా హాస్పిటల్ సీన్ తో మొదలెడదాం.  

* * *
టైం 3 పీ ఎం

“వెంటనే ఈ గ్రూప్ తీసుకురండి. లేకపోతే చాలా ప్రమాదం “ డాక్టర్ హెచ్చరించాడు.
ప్రిస్క్రిప్షన్ నీ , డాక్టర్ ముఖాన్నీ తేరిపార చూశాడు గోపాల కృష్ణ.
“కానీ డాక్టర్,ఇది ఎక్కడ దొరుకుతుంది?”
“నో ఐడియా. బాబు కాలేజీ, ట్యూషన్ సెంటర్ చుట్టు పక్కల వెతకండి. గల్లీ గల్లీ లో కనుక్కోండి. బయల్దేరండి,సెలైన్ 40 నిమిషాల్లో అయిపోతుంది. ఈ లోపు ఈ గ్రూప్ దొరక్కపోతే నేనేమీ చెయ్యలేను , గో మ్యాన్ “ అని డాక్టర్ గోపాలకృష్ణ ని తోసినంత పని చేశాడు.

* * *
టైం 3. 10 పీ ఎం

ఆగమేఘాల మీద గోపాలకృష్ణ అబ్బాయి పవన్ కాలేజీ దగ్గరికి వెళ్ళాడు. ఎగ్జామ్స్ అయిపోవడం తో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు. ఆ వీధి మొత్తం ఫ్యాక్షనిష్టులు దాడి చేసినట్టు నిర్మానుష్యం గా ఉంది. ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి’ అని పాడుకుంటూ గోపాల కృష్ణ గబా గబా పవన్ కంప్యూటర్ కోచింగ్ సెంటర్ ఉన్న అమీర్ పేట కి వెళ్ళాడు. అక్కడ రోడ్డు మీద పడి  ఉన్న పాంఫ్లెట్లూ, బ్రోచర్లూ చూసి ఏదో హీరో కొత్త సినిమా రిలీజ్ అయిందనుకున్నాడు. కొంచెం చదువుకున్న వాళ్ళలా కనిపించిన 
అబ్బాయిల దగ్గరికి వెళ్లి “బాబూ, పేరేంటి?”అన్నాడు.

అప్పుడు వాళ్ళలో ఒక బాబు “మహేష్ “ అన్నాడు.

“ఆ..... మహేష్ బాబు సినిమానా ?” అని కొడుకు ఎమర్జెన్సీ లో ఉన్న సంగతి మర్చిపోయి
మురిసిపోయాడు గోపాలం.
“సినిమా ఏంటి అంకుల్? నా పేరు మహేష్ అని చెప్పా “ అన్నాడు ఆ పిలగాడు.

ఆశాభంగం భరించలేక నీరసించిన గొంతు తో “ఓహ్ అలాగా! కాగితాలతోనే రోడ్డు వేశారా అనిపించేట్టుగా  చింపి పడేసిన కాగితం ముక్కలు చూసి సినిమా రిలీజ్ అనుకున్నాలే.”
“న్యూ కంప్యూటర్ కోర్సెస్ రిలీజ్ అంకుల్ “
“అలాగా. మహేష్,నాకో చిన్న హెల్ప్ చెయ్యాలి. ఈ గ్రూప్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?” అని డాక్టర్ ఇచ్చిన కాగితం చూపించాడు.
అసలే డాక్టర్ల  రైటింగ్ అర్థం కాదు. అందులో ఇంగ్లీష్ చదవటం రాని మహేష్ కి ఏమర్థమవుతుంది? అక్కడున్న అబ్బాయిలెవరూ దాన్ని చదవలేకపోయారు.
ఇంతలో దేవుడు చేసిన మనిషొకడు వచ్చి “ నాకివ్వండి “ అని తీసుకొని పైకి చదివాడు. 
అందరూ ఆశ్చర్య పోయారు.
“ఓహ్ ఈ గ్రూపా?ఈ ఏరియా కాదు. అశోక్ నగర్ లో ట్రై చెయ్యండి. అక్కడ కూడా చాలా కోచింగ్ 
సెంటర్ లు ఉన్నాయి కదా” అని సలహా ఇచ్చారు.

* * *

టైం 3. 23 పీ ఎం

19 నిమిషాల దూరాన్ని 8 నిమిషాల్లో కవర్ చేసి గోపాలకృష్ణ పవన్ చదువుతున్న ట్యుటోరియల్ దగ్గర స్కూటర్ స్టాండ్ వేశాడు. నిజమే,ఇక్కడికి ముందే వస్తే కొంచెం టైం సేవ్ అయ్యేది. తనకి టెన్షన్ లో గుర్తు రాలేదు, పవన్ రోజూ సాయంత్రం ఇక్కడికే వస్తాడు. ఈ ట్యుటోరియల్ లో చేర్చిన దగ్గరనుంచి రాత్రి పూట అన్నం తినటం మానేశాడు. భార్య రోజూ గొడవ- పిల్లాడి ఆరోగ్యం పాడైపోతోందని! చదువు ధ్యాస లో పడి భోజనం నిర్లక్ష్యం చేశాడనుకున్నాడు కానీ ఇంతలా జాగ్రత్త
తీసుకున్నాడనుకోలేదు. పైగా రోజూ వంద రూపాయల ఖర్చు చూపించి పాకెట్ మనీ అడిగితే పోనీలే ఆటోల్లో తిరిగితే డబ్బులు నీళ్ళలా ఖర్చవుతాయి, చదువుకునే కుర్రాడు వాడికీ ఇంకేం అవసరాలు ఉంటాయిలే అనుకున్నాడు. ఈ విధంగా చేస్తాడనుకోలేదు!

విషాద స్వగతానికి కొంచెం బ్రేక్ ఇచ్చి హెల్ప్ చేసే వాళ్ళ కోసం అటూ ఇటూ చూశాడు. అప్పుడొచ్చింది వాసన !! 
అవును ఇదే వాసన; రైట్ ! పవన్ దగ్గర ఈ వాసనే వచ్చేది. కొంచెం ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఎస్ ఇదే !! అలా వాసన పీలుస్తూ ఆ ఇంటి దాకా వెళ్ళాడు. ఆ ఇల్లు పానీ పూరి బండి శివది.

* * *

పవన్ ని అటెండ్ అవుతున్న డాక్టర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. హరప్పా హంపీ శిధిలాల్లోంచి ఎన్ని శతాబ్దాలైనా వింత విషయాలు బయట పడుతూనే ఉన్నట్టు పవన్ బాడీ కంపోజిషన్ పరిశీలన లోంచి అనేక కొత్త విషయాలు బయట పడుతున్నాయి . మనిషి శరీరంలో తొంభై శాతం 
నీరుంటుంది. అయితే ప్రతి రోజూ చాట్ బండీల దగ్గర బాతాఖాని కొడుతూ గంటలు గంటలు గడిపే వాళ్ళ శరీరం లో మాత్రం మామూలు నీళ్ళ బదులు పానీ పూరి “పానీ “ ఉంటుంది.  భారతీయుల్లో ఈ మధ్య ఈ లక్షణం పెచ్చరిల్లిపోతోంది.సాయంత్రమైతే చాలు ప్రాణం “పానీ పానీ “అని కొట్టుకుంటూ ఉంటుంది. పసి యువ, ముసలి ముతక, ఆడా మగా తేడా లేకుండా అందరికీ ఈ తపన కామన్. వారి రక్తం లో చింతపండు శాతం కూడా మెజర్ చెయ్యచ్చు.  

పానీ వెళ్లి పూరి లో పడ్డా పూరి వెళ్లి పానీ లో పడ్డా మునిగేది పూరి యే. ఈ సత్యం గ్రహించని వాడు 
పానీ పూరీ తినటం అంటే కాలాపానీ యే !!!


***
టైం 3. 40 పీ ఎం

గోపాల కృష్ణ శివని స్కూటర్ మీద ఎక్కించుకొని హాస్పిటల్ కి చేరుకున్నాడు. శివ తెచ్చిన బానని
బాయ్ సహాయంతో పవన్ ఉన్న రూం కి షిఫ్ట్ చేశారు. అందులో “పానీ “ ఉంది. వెంటనే డాక్టర్ దాన్ని సెలైన్ బాటిల్ కి కనెక్ట్ చేసి పవన్ కి ఇంజెక్ట్ చేశాడు. 5నిమిషాల్లోనే పవన్ కళ్ళు తెరిచి “కట్ లెట్ “ అని మగత గా మళ్ళీ మూసుకున్నాడు. ఇంతకీ  శివ గ్రూప్ లో ఉన్నదీ, వేరే బండ్ల దగ్గర లేనిదీ ఏమిటి ఆ ఫార్ములా అని  మీరు అడక్కూడదు ! అది ప్రొఫెషనల్ సీక్రెట్!!!

ది ఎండ్

--మోహిత

For ‘Vibrations’

ఇంటికెళ్లాలి

ఇంటికెళ్లాలి


అవి లాలు రైల్వే మినిస్టర్ గా ఉన్న రోజులు.రిజర్వేషన్ కి ఇప్పుడున్నంత మోజు లేదు.  ప్రజలంతా మట్టి ముంతల్లో కాఫీలు మజ్జిగలు తాగుతూ టైమంటే టైముకే బయలు దేరే రైళ్ళ కోసం పడి గాపులు కాస్తుండేవాళ్ళు.
* * *
రాధ గుంటూరు లో ఇంజనీరింగ్ చదువుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఇంటర్ కాలేజీ ఫెస్ట్ కి వచ్చింది.ఫెస్ట్ అయిపోయాక అందరూ తిరిగి వెళ్ళిపోయినా హైదరాబాద్ అంతా తిరిగి చూడాలని తను మాత్రం ఉండిపోయింది. ప్రాజెక్ట్ రిపోర్టులు,చార్టులు అన్నీ అవతల పడేసి బ్యాగుని కోఠి లో కొత్తగా కొన్న వస్తువులతో నింపేసింది. ఇంటికెళ్ళే దాకా బ్యాగ్ ఈ బరువు ఆపగలుగుతుందా?
ఫరవాలేదనుకొని వీపుకి తగిలించుకొని ఊరంతా చుట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చింది. రేపే ఉగాది. ఎలా అయినా సరే ఇవాళే ఇంటికి వెళ్లిపోవాలి. రేతిఫైల్ నుంచి స్టేషన్ లోపలి కెళ్ళే మెట్లు ఎక్కుతుంటే  ఫట్ మని బ్యాగ్ హేండిల్ తెగింది. ఒకటవ నంబరు ప్లాట్ ఫాం మీద రైలుంది. రాధ ఒక్క క్షణం ఆలోచించింది. టికెట్ కొనడం ముఖ్యమా? బ్యాగ్ కుట్టుకోవడానికి సూదీ దారం ముఖ్యమా ?భారతీయ రైల్వే లాభాల్లో నడుస్తోందని ముందు రోజు పేపర్ లో చదివిన  వార్త గుర్తుకు  వచ్చింది. తక్షణం సూదీ దారం కొనడానికి రోడ్డు మీదకి పరిగెత్తింది.రెండ్రూపాయలకి దారపుండ దొరికింది. రెండు నిముషాలు వెతికితే గానీ సూది దొరకలేదు. మూడు నిముషాల్లో తిరిగి స్టేషన్ కి చేరుకుంది. పల్నాడు ఎక్స్ ప్రెస్ అప్పటికే కదిలింది.

జనం తలుపులకీ కిటికీలకీ  వేలాదిగా వేలాడుతున్నారు. టికెట్ లేని ప్రయాణం సేఫ్ గా చెయ్యాలంటే ఇలాంటి ట్రెయినే కరెక్ట్ అనుకుంది రాధ . ట్రైన్ ని అందుకోవడానికి పరిగెత్తుతోంది.ఒక తలుపు కి దగ్గరగా వెళ్ళాక “ప్లీజ్ ప్లీజ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి “ అంటూనే తన బరువైన బ్యాగ్ ని ఒకాయన మీదకి విసిరేసింది. ఆయన అది తప్పించుకోవటానికి పక్కకి జరిగాడు.దాంతో కొంచెం ప్లేస్ వచ్చింది . ఇదే అదనుగా విష్ణు చక్రం లా దూసుకొచ్చి డోర్ మెట్ల మీద కాలు పెట్టింది.ఒకాయన పడి పోకుండా చెయ్యి పట్టుకున్నాడు. స్టేషన్ దాటాక డోర్ దగ్గర అందరూ మగవాళ్ళు కావడం తో వాళ్ళు సిగ్గుపడి ఆమెను సేఫ్ గా కంపార్ట్మెంట్ లోపలికి  తోశారు. థాంక్స్ చెప్పి బ్యాగ్ తీసుకొని ఆ జన సంద్రం లో బెర్తుల వైపు ఈదింది. లోపల ఆడవాళ్ళు నుంచొని ఉన్నారు. ఒక అప్పర్ బెర్త్ నిండా సామాన్లున్నాయి. ముందూ వెనకా
చూడకుండా రాధ ఆ బెర్త్ మీదకి ఎగబాకి తను కూర్చునేంత జాగా సంపాదించింది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా
లగేజ్ ని  సామాన్ల కోసం ఉండే సైడ్ ర్యాక్ మీద పెట్టకుండా మనుషుల కోసం ఏర్పాటు చేసిన బెర్తుల మీదే పెట్టి
వాళ్ళు నుంచుంటారు! పోనీలే ఆ అలవాటు వల్లే ఇంత రద్దీగా ఉన్న ట్రైన్ లో కూ డా తనకి సీట్ దొరికింది !
హమ్మయ్య ! ఓ ఐదు గంటలు కళ్ళు మూసుకుంటే ఇంటికెళ్ళి పోవచ్చు !!
(ఇంతటి తో ఏక్షన్ పార్ట్ ముగిసింది)

* * *
ఇంకా ఆయాసం తగ్గలేదు. కొంచెం వాటర్ ఉంటే  బాగుండు. ఎవరినైనా అడుగుదామని అటూ ఇటూ, ఎదురు బెర్త్ వైపూ చూసింది. అంతే!ఆశ్చర్య పోయి అలానే చూస్తుండి పోయింది. ఒక అబ్బాయి (ఓ మోస్తరు అందగాడేలే !) చాలా భక్తితో శ్రద్ధగా తన చెప్పుల్ని బెర్తు పైన సర్దుతున్నాడు. ఈ భూ ప్రపంచమ్మీద చెప్పుల ప్రేమికుల్లో తనే నం.1 అని విర్రవీగే రాధకి గర్వభంగం అయింది. ఇంత రష్ లో కూడా ఆ అబ్బాయి తన చెప్పుల్ని బెర్త్ మీదకు చేర్చగలిగాడంటే గ్రేట్ ! తను చూడు,చేత కాని దానిలా రెండు పాద రక్షల్నీ లోయర్ బెర్త్ కిందకి నెట్టేసింది!

నీళ్ళు దొరికే ఛాన్స్ లేదని అర్థమైంది. నెమ్మదిగా సూది దారం తీసింది. ట్రైన్ కదలిక కి అసలు సూదిలో దారం ఎక్కించ టానికే అరగంట పట్టింది.ఎవరైనా చూస్తారేమోనని నామోషి ఫీల్ అయి గోడ వైపు తిరిగి కూర్చోవటం వల్ల గాలి వెలుతురూ లేవు. మొత్తానికి ఓ గంట కుస్తీ పడి బ్యాగ్ ని చాలా పక్కాగా కుట్టేసింది. అందులో మౌంట్ ఎవరెస్ట్ ని పెట్టినా తెగదు అన్న నమ్మకం కుదిరాక ఇక పుస్తకం తీసి తాపీగా బెర్త్ కి జారగిల పడింది. ఏదో స్టేషన్ లో రైలు ఆగినపుడు ఒకాయన్ని అడిగి వాటర్ బోటిల్ కొనుక్కుంది.
పొద్దుట్నుంచి తిరిగి తిరిగి ఉన్నదేమో బాగా ఆకలేస్తోంది. హైదరాబాద్ టు గుంటూర్ రూట్లో తనకి బాగా నచ్చేది సమోసాలు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నప్పుడు సమోసాల వాడెక్కడ నుంచి ఊడిపడతాడు ? అని నిట్టూర్చింది రాధ. థింక్ ఆఫ్ ది డెవిల్ ! అనుకోగానే ఎక్కడ నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో అష్ట విన్యాసాలు చేస్తూ ఎడమ చేతికి బుట్ట తగిలించి కుడి చేత్తో పొట్లాలు కడుతూ సమోసాల వాడొచ్చాడు. రాధక్కూడా ప్రాణం లేచొచ్చింది. కాస్త క్షుద్బాధ తీరాక ఒక భయం పట్టుకుంది. టి సి కూడా వీడి లాగే సడన్ గా ఊడి  పడతాడేమో! పుస్తకం చదువుతోందన్న మాటే గానీ నిమిషానికొకసారి నల్ల కోటు కనిపిస్తుందేమో నని ఉలికులికి పడుతోంది .
ఇంత మందిని ఎక్కువ సేపు మొయ్య లేక కాబోలు రైలు కూడా త్వరగా గుంటూరు చేర్చింది . దిగాక కాసేపు చల్ల గాలికి
ఎటూ కదలకుండా అలాగే నుంచున్న రాధ కంట్లో గేటు దగ్గర నుంచున్న టి సి పడ్డాడు. ఈయన్ని అంతకు ముందు ఒకసారి టికెట్ లేని వాళ్ళని ఆర్ పీ ఎఫ్ వాళ్లకి పట్టిస్తున్నప్పుడు చూసింది. ఇప్పుడెలా తప్పించుకోవటం ? ఎదురుగా ఒక పెద్ద ఫ్యామిలీ కనపడ్డారు. అందరికన్నా పెద్దావిడ నెమ్మది గా నడుస్తూ వెనకబడిపోతోంది.రాధ ఒకే ఒక్క క్షణం
ఆలోచించి గబగబా ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. “మామ్మ గారూ  బ్రాడీ పేట వెళ్ళాలంటే ఎలా?” అని మాటలు కలిపింది.
ఇంటికి పెద్ద టిసి కి టికెట్ ఇచ్చి గుంపు మొత్తాన్ని చూపించాడు.
అలా రాధ ఆ గేమ్ లోని లెవెల్స్ అన్నీ దాటి క్షేమంగా ఇంటికి చేరింది.
(ఇంతటి తో సస్పెన్స్ పార్ట్ ముగిసింది)

- మోహిత
For ‘Vibrations’