Sunday 9 June 2013

ఇంటికెళ్లాలి

ఇంటికెళ్లాలి


అవి లాలు రైల్వే మినిస్టర్ గా ఉన్న రోజులు.రిజర్వేషన్ కి ఇప్పుడున్నంత మోజు లేదు.  ప్రజలంతా మట్టి ముంతల్లో కాఫీలు మజ్జిగలు తాగుతూ టైమంటే టైముకే బయలు దేరే రైళ్ళ కోసం పడి గాపులు కాస్తుండేవాళ్ళు.
* * *
రాధ గుంటూరు లో ఇంజనీరింగ్ చదువుతోంది. హైదరాబాద్ లో జరుగుతున్న ఇంటర్ కాలేజీ ఫెస్ట్ కి వచ్చింది.ఫెస్ట్ అయిపోయాక అందరూ తిరిగి వెళ్ళిపోయినా హైదరాబాద్ అంతా తిరిగి చూడాలని తను మాత్రం ఉండిపోయింది. ప్రాజెక్ట్ రిపోర్టులు,చార్టులు అన్నీ అవతల పడేసి బ్యాగుని కోఠి లో కొత్తగా కొన్న వస్తువులతో నింపేసింది. ఇంటికెళ్ళే దాకా బ్యాగ్ ఈ బరువు ఆపగలుగుతుందా?
ఫరవాలేదనుకొని వీపుకి తగిలించుకొని ఊరంతా చుట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చింది. రేపే ఉగాది. ఎలా అయినా సరే ఇవాళే ఇంటికి వెళ్లిపోవాలి. రేతిఫైల్ నుంచి స్టేషన్ లోపలి కెళ్ళే మెట్లు ఎక్కుతుంటే  ఫట్ మని బ్యాగ్ హేండిల్ తెగింది. ఒకటవ నంబరు ప్లాట్ ఫాం మీద రైలుంది. రాధ ఒక్క క్షణం ఆలోచించింది. టికెట్ కొనడం ముఖ్యమా? బ్యాగ్ కుట్టుకోవడానికి సూదీ దారం ముఖ్యమా ?భారతీయ రైల్వే లాభాల్లో నడుస్తోందని ముందు రోజు పేపర్ లో చదివిన  వార్త గుర్తుకు  వచ్చింది. తక్షణం సూదీ దారం కొనడానికి రోడ్డు మీదకి పరిగెత్తింది.రెండ్రూపాయలకి దారపుండ దొరికింది. రెండు నిముషాలు వెతికితే గానీ సూది దొరకలేదు. మూడు నిముషాల్లో తిరిగి స్టేషన్ కి చేరుకుంది. పల్నాడు ఎక్స్ ప్రెస్ అప్పటికే కదిలింది.

జనం తలుపులకీ కిటికీలకీ  వేలాదిగా వేలాడుతున్నారు. టికెట్ లేని ప్రయాణం సేఫ్ గా చెయ్యాలంటే ఇలాంటి ట్రెయినే కరెక్ట్ అనుకుంది రాధ . ట్రైన్ ని అందుకోవడానికి పరిగెత్తుతోంది.ఒక తలుపు కి దగ్గరగా వెళ్ళాక “ప్లీజ్ ప్లీజ్ కొంచెం ప్లేస్ ఇవ్వండి “ అంటూనే తన బరువైన బ్యాగ్ ని ఒకాయన మీదకి విసిరేసింది. ఆయన అది తప్పించుకోవటానికి పక్కకి జరిగాడు.దాంతో కొంచెం ప్లేస్ వచ్చింది . ఇదే అదనుగా విష్ణు చక్రం లా దూసుకొచ్చి డోర్ మెట్ల మీద కాలు పెట్టింది.ఒకాయన పడి పోకుండా చెయ్యి పట్టుకున్నాడు. స్టేషన్ దాటాక డోర్ దగ్గర అందరూ మగవాళ్ళు కావడం తో వాళ్ళు సిగ్గుపడి ఆమెను సేఫ్ గా కంపార్ట్మెంట్ లోపలికి  తోశారు. థాంక్స్ చెప్పి బ్యాగ్ తీసుకొని ఆ జన సంద్రం లో బెర్తుల వైపు ఈదింది. లోపల ఆడవాళ్ళు నుంచొని ఉన్నారు. ఒక అప్పర్ బెర్త్ నిండా సామాన్లున్నాయి. ముందూ వెనకా
చూడకుండా రాధ ఆ బెర్త్ మీదకి ఎగబాకి తను కూర్చునేంత జాగా సంపాదించింది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా
లగేజ్ ని  సామాన్ల కోసం ఉండే సైడ్ ర్యాక్ మీద పెట్టకుండా మనుషుల కోసం ఏర్పాటు చేసిన బెర్తుల మీదే పెట్టి
వాళ్ళు నుంచుంటారు! పోనీలే ఆ అలవాటు వల్లే ఇంత రద్దీగా ఉన్న ట్రైన్ లో కూ డా తనకి సీట్ దొరికింది !
హమ్మయ్య ! ఓ ఐదు గంటలు కళ్ళు మూసుకుంటే ఇంటికెళ్ళి పోవచ్చు !!
(ఇంతటి తో ఏక్షన్ పార్ట్ ముగిసింది)

* * *
ఇంకా ఆయాసం తగ్గలేదు. కొంచెం వాటర్ ఉంటే  బాగుండు. ఎవరినైనా అడుగుదామని అటూ ఇటూ, ఎదురు బెర్త్ వైపూ చూసింది. అంతే!ఆశ్చర్య పోయి అలానే చూస్తుండి పోయింది. ఒక అబ్బాయి (ఓ మోస్తరు అందగాడేలే !) చాలా భక్తితో శ్రద్ధగా తన చెప్పుల్ని బెర్తు పైన సర్దుతున్నాడు. ఈ భూ ప్రపంచమ్మీద చెప్పుల ప్రేమికుల్లో తనే నం.1 అని విర్రవీగే రాధకి గర్వభంగం అయింది. ఇంత రష్ లో కూడా ఆ అబ్బాయి తన చెప్పుల్ని బెర్త్ మీదకు చేర్చగలిగాడంటే గ్రేట్ ! తను చూడు,చేత కాని దానిలా రెండు పాద రక్షల్నీ లోయర్ బెర్త్ కిందకి నెట్టేసింది!

నీళ్ళు దొరికే ఛాన్స్ లేదని అర్థమైంది. నెమ్మదిగా సూది దారం తీసింది. ట్రైన్ కదలిక కి అసలు సూదిలో దారం ఎక్కించ టానికే అరగంట పట్టింది.ఎవరైనా చూస్తారేమోనని నామోషి ఫీల్ అయి గోడ వైపు తిరిగి కూర్చోవటం వల్ల గాలి వెలుతురూ లేవు. మొత్తానికి ఓ గంట కుస్తీ పడి బ్యాగ్ ని చాలా పక్కాగా కుట్టేసింది. అందులో మౌంట్ ఎవరెస్ట్ ని పెట్టినా తెగదు అన్న నమ్మకం కుదిరాక ఇక పుస్తకం తీసి తాపీగా బెర్త్ కి జారగిల పడింది. ఏదో స్టేషన్ లో రైలు ఆగినపుడు ఒకాయన్ని అడిగి వాటర్ బోటిల్ కొనుక్కుంది.
పొద్దుట్నుంచి తిరిగి తిరిగి ఉన్నదేమో బాగా ఆకలేస్తోంది. హైదరాబాద్ టు గుంటూర్ రూట్లో తనకి బాగా నచ్చేది సమోసాలు. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నప్పుడు సమోసాల వాడెక్కడ నుంచి ఊడిపడతాడు ? అని నిట్టూర్చింది రాధ. థింక్ ఆఫ్ ది డెవిల్ ! అనుకోగానే ఎక్కడ నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో అష్ట విన్యాసాలు చేస్తూ ఎడమ చేతికి బుట్ట తగిలించి కుడి చేత్తో పొట్లాలు కడుతూ సమోసాల వాడొచ్చాడు. రాధక్కూడా ప్రాణం లేచొచ్చింది. కాస్త క్షుద్బాధ తీరాక ఒక భయం పట్టుకుంది. టి సి కూడా వీడి లాగే సడన్ గా ఊడి  పడతాడేమో! పుస్తకం చదువుతోందన్న మాటే గానీ నిమిషానికొకసారి నల్ల కోటు కనిపిస్తుందేమో నని ఉలికులికి పడుతోంది .
ఇంత మందిని ఎక్కువ సేపు మొయ్య లేక కాబోలు రైలు కూడా త్వరగా గుంటూరు చేర్చింది . దిగాక కాసేపు చల్ల గాలికి
ఎటూ కదలకుండా అలాగే నుంచున్న రాధ కంట్లో గేటు దగ్గర నుంచున్న టి సి పడ్డాడు. ఈయన్ని అంతకు ముందు ఒకసారి టికెట్ లేని వాళ్ళని ఆర్ పీ ఎఫ్ వాళ్లకి పట్టిస్తున్నప్పుడు చూసింది. ఇప్పుడెలా తప్పించుకోవటం ? ఎదురుగా ఒక పెద్ద ఫ్యామిలీ కనపడ్డారు. అందరికన్నా పెద్దావిడ నెమ్మది గా నడుస్తూ వెనకబడిపోతోంది.రాధ ఒకే ఒక్క క్షణం
ఆలోచించి గబగబా ఆవిడ పక్కకి వెళ్ళిపోయింది. “మామ్మ గారూ  బ్రాడీ పేట వెళ్ళాలంటే ఎలా?” అని మాటలు కలిపింది.
ఇంటికి పెద్ద టిసి కి టికెట్ ఇచ్చి గుంపు మొత్తాన్ని చూపించాడు.
అలా రాధ ఆ గేమ్ లోని లెవెల్స్ అన్నీ దాటి క్షేమంగా ఇంటికి చేరింది.
(ఇంతటి తో సస్పెన్స్ పార్ట్ ముగిసింది)

- మోహిత
For ‘Vibrations’

No comments:

Post a Comment