Sunday 31 March 2013

విజేత


నువ్వు నేను మనం

హైద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా బిజీ గా ఉంది.అప్పుడే ఆగిన రైల్లోంచి తొక్కుకుంటూ తోసుకుంటూ దిగారు తల్లీ కూతుళ్ళు.వాళ్ళ నాలుగు చేతుల్లో నాలుగు బ్యాగులు.బాగా బరువున్నట్టున్నాయి , మొయ్యలేక పోతున్నారు అనుకున్నాడు తేజ.అతనూ వాళ్ళ వెనకే రైలు దిగాడు.’అమ్మా ,నేను పట్టుకోనా?’ అడిగాడు.తల్లి ఎగాదిగా చూసింది.కూతురు అవసరం లేదు అని తల విదిలించేసింది.అలానే అవస్థలు పడుతూ ప్లాట్ఫాం దాటటానికి మెట్ల వంతెన ఎక్కుతున్నారు. తేజ మళ్ళీ అడిగాడు.ఆవిడ సందేహ పడుతూనే ఒక హేండిల్ ఇచ్చింది.తోటి మనిషి సహాయం చేస్తానన్నా ఒప్పుకోలేని కాలమిది.
    
   తేజ బీకాం చదువుతున్నాడు.ఇంటర్మీడియట్ లో రెడ్ క్రాస్ లో ఒకసారి బ్లడ్ డొనేట్ చేశాడు .అప్పట్నుంచీ సమాజ సేవ మీద ఆసక్తి మొదలైంది.”యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ అఫ్ అవర్ కంట్రీ “ అని అజయ్ సర్ చెప్పిన మాటలు అతన్ని బాగా ప్రభావితం చేశాయి .ఎయిడ్స్ డే,వరద బాధితుల కోసం విరాళాల సేకరణ వంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.చెప్పేది చెయ్యని స్వచ్ఛంద సంస్థలు నచ్చలేదు.తనే ఏదైనా సొంతంగా స్టార్ట్ చేస్తే? ఏం  చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలీదు. కానీ ఏదో ఒకటి చెయ్యాలనే తపన.

   పది మంది స్నేహితులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు.ముహూర్త సమయానికి అందరూ ఏవో కారణాలు చెప్పి హ్యాండ్ ఇచ్చారు.నిరాశ . ఒక్కడే రోజంతా గుంటలు తవ్వుకుంటూ తెచ్చిన వంద మొక్కలూ నాటాడు.ఫ్రెండ్స్ తో కుదర్దులే అని కొన్నాళ్ళు ఒంటరి పయనం. సంచార జాతులతో సంచరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడు.స్లం ఏరియాల్లో తిరిగాడు. పిల్లలు తరిమేస్తే కట్టు బట్టలతో ఇల్లొదిలి ఒక చోట చేరిన పొట్ట డొక్కకతుక్కుపోయిన  ముసలి తల్లిదండ్రులను చూసాడు. వాళ్ళ చేత బిచ్చ మెత్తించి కొంత మంది కమిషన్ తీసుకుంటారు.వాళ్ళందరికీ చదువొచ్చు .కూలి పని చేసుకునే ఓపిక ఉంది. ఓటు హక్కు కూడా ఉంది. మీటింగుల కోసం లారీల్లో వాళ్ళని తరలిస్తారు. అయినా భిక్షాటన చేస్తూ కాంట్రాక్టర్ల చెప్పు చేతల్లో ఎందుకుపడి  ఉంటున్నారో అని తేజ ఆశ్చర్యపోతున్నాడు.రోజూ  అదే ప్రాంతానికి వెళ్తుంటే ప్రభుత్వ  గూఢ చారో , రహస్య టీవీ విలేఖరో అని వాళ్ళు అనుమాన పడ్డారు.అతని రాకని కట్టడి చేశారు .తేజ కి కూడా వాళ్ళని తను బాగు చేయాల్సిన అవసరం లేదనిపించింది.నిజంగా ఈ లోకంలో ఎవరికీ సహాయం అవసరం లేదా? ఎవరి బతుకు వాళ్ళు దర్జాగా ఈడ్చగలరా  వంటి ప్రశ్నలు వేధిస్తున్నాయి.

అంతలో ఒక రోజు ఒక ఎస్సెమ్మెస్  వచ్చింది- “మా అమ్మాయికి ఫలానా జబ్బు.ఆపరేషన్ కి నాలుగు లక్షలవుతుందని డాక్టర్లు చెప్పారు.దయచేసి ఈ మెసేజ్ ను మీకు తెలిసిన వారందరికీ పంపండి. ఒక్కో ఫార్వర్డ్ కి పది పైసలు మాకు జమ అవుతాయి.” తేజ వెంటనే ఫ్రెండ్స్ అందరికి ఒక వెయ్యి సార్లు, తన నెంబర్ కు తానే ఒక వెయ్యి సార్లు ఆ మెసేజ్ పంపాడు. ఆ నాలుగు లక్షల్లో ఈ ఇరవై రూపాయలు ఏ మూలకి అని తర్కించుకొని ఆ ఎస్సెమ్మెస్ పంపిన నెంబర్ కి ఫోన్ చేసాడు.అలా రాకేష్ అన్నయ్యతో పరిచయం.నీ ఆలోచన మంచిదే కాని ముందు కెరీర్ చూసుకో అని రాకేష్ అన్నయ్య హితవు పలికాడు.తేజ కొన్నాళ్ళు బుద్ధిగా చదువు కొనసాగించి ‘పట్టా’ పుచ్చుకొన్నాడు.
 
ఆడే నోరు, తిరిగే కాలు, సహాయం చేసే చెయ్యి ఎక్కువ కాలం ఊరకే ఉండలేవు.2009.ఫేస్ బుక్ అప్పుడప్పుడే పాపులారిటీ సంపాదిస్తున్న రోజులు.ఆ యుద్ధంలో ఆర్కుట్ ఓడిపోబోతోందని అర్థమై తేజ కూడా ఎఫ్ బి  లో ఒక ఎకౌంట్  తెరిచాడు.వెంటనే ఒక ఇన్విటేషన్ “ఈ గ్రూప్ లో తెలుగు వాళ్ళెవరైనా చేరచ్చు “ అని.అక్కడ ఎన్నో డిస్కషన్స్.తెలంగాణా రాష్ట్రం ఇవ్వలా వద్దా ? తెలుగుని ఇంగ్లీష్ లో ఎందుకు టైప్  చేయాలి? కప్పు కాఫీ లో ఎన్ని స్పూన్ల చక్కెర వేసుకోవాలి వంటి వాడి- వేడి చర్చలు జరుగుతుండేవి.

’దొంగ బాబాల్ని అరికట్టాలంటే ఏం చేయాలి అని తేజ అడిగాడు.ఆ ప్రశ్న తో ప్రమోద్ , ఆర్యన్ 
కలిశారు.కొన్నాళ్ళకి గ్రూప్ లో ఫ్లర్టింగ్ ఎక్కువైపోయింది.తేజ తనకు జెన్యూన్  అనిపించిన స్నేహితులందరినీ పోగు చేసి ‘యాస్పైరింగ్ డ్రీమర్స్ ‘ అనే గ్రూప్ స్టార్ట్ చేశాడు. సంఘ సేవ చేసి దెబ్బ తిన్న ఆదర్శాలతో వేగి పోతున్న యువత అంతా ఇందులో చేరచ్చు.

శశికాంత్ చేరినప్పుడు తేజ ని “ నాకొక వెయ్యి మందిని ఇస్తే ఆంధ్ర ప్రదేశ్ ని మార్చేస్తాను “ అని ఛాలెంజ్ చేశాడు. మళ్ళీ అదే ప్రశ్న.ఏం  చేయాలి ఎలా చేయాలి? బ్రెయిన్ స్టామింగ్  చేస్తున్నారు.స్కూళ్ళకి వెళ్లి విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు.ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న గురువులు దీన స్థితి లో ఉండటం చూడలేక పాకెట్ మనీ అంతా పోగు చేసి చేతనైన సహాయం చేసారు. ఫోటోలు దిగుదామంటే సెల్ లో ఛార్జింగ్ లేదు. ఇంటికి వెళదామంటే చార్జీ కి డబ్బుల్లేవు.అతి కష్టమ్మీద ఎవరిళ్ళకి వాళ్ళు  చేరుకున్నారు.
ఉద్యోగం వస్తే ఇంకొంచెం వెసులుబాటు ఉంటుందని అందరి ఆమోదం తో విడిపోయారు. క్వాంటిటి కాదు క్వాలిటీ ముఖ్యం అనుకున్నారు.ఇగో డిఫరెన్సెస్ వస్తున్నాయి.అయినా ట్రాన్స్పరెన్సీ కే పెద్ద పీట!”నేను కాదు-మేము”-- ఇదే ఆదర్శం తో
ముందుకు సాగుతున్నారు.

---మోహిత
For ‘Vibrations’


No comments:

Post a Comment