Sunday 31 March 2013

పరమ దేవత


పరమ దేవత
ఆహా ! ఎంత ప్రశాంతత ! చుట్టూ అరవై కిలోమీటర్ల వరకు సుతి మెత్తటి దూది ఉన్న పట్టు పరుపులు వేసి వాటి మీద తను పడుకొని చివరి దాకా పొర్లుతున్నట్టు !ఆ దూది నిజంగా దూది కాదు , మేఘాలైపోయినట్టు ! మేఘాల మీద చంద్రుడి దాకా తను సిల్కు బట్టల్లో తేలిపోతున్నట్టు ! అప్పుడు గాలి మంద్ర మంద్రంగా వీస్తూ ముంగురులను మృదువుగా తడుముతున్నట్టు . తను ఆ వెన్నెల తెల్లదనాన్ని భరించలేక కళ్ళు మూసుకున్నట్టు ! కళ్ళు మూసుకున్నా ఆపలేని చల్లదనాన్ని కురిపించే చంద్రునికి తను దగ్గరవుతున్నట్టు ! యుగాలుగా కోరుకున్న అమరానందం ఇదే  అయినట్టు ! గుండెల్లో గంటలు  మోగుతున్నాయి . ‘ఇదే ఇదే నేను కోరుకున్నది … ఇలా ఇలా చూడాలని ఉంది ‘ పాట ట్యూన్ కి ఆ గంటల మోతను ఓవర్లాప్ చెయ్యాలి..  ఏంటి కలవట్లేదు?....

‘మధూ !లేరా .. బెల్ కొట్టేశారు , సోషల్ పీరియడ్ అయిపోయింది ‘
ఒక్క కుదుపు తో ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి టైపు లో చంద్రుడి మీద నుంచి క్లాసు రూం లో
కొచ్చి పడ్డాడు మధు. సోషల్ మేడం టాలెంట్ గురించి తనకు తెలుసు. చెవిటి వాడికైనా సరే ఒక్క పది నిముషాల్లో నిద్ర తెప్పించగల ఘనత ఆవిడ సొంతం . అందుకే ఆవిడ క్లాస్ ని అంతగా ఇష్టపడతాడు . స్కూల్ డేస్ లో ఫేవరెట్ టీచర్ ఎవరంటే ఆవిడ పేరే చెప్పేవాడు .ఎందుకు  అని ఎవరైనా అతి ఔత్సాహికులు  అడిగితే     ‘ఆవిడ పాఠం తలకి బాగా ఎక్కుతుంది ‘ అని సమాధాన మిచ్చేవాడు .
*      *        *
ఏదీ ఇప్పుడా బంగారు కాలం?ఏదీ ఇప్పుడా లోకాతీత సర్వోన్నత సకల సుర భోగ నిద్ర? అలాంటి టీచర్లు ఈ ఇంటర్మీడియెట్లో ఉండరు . కామర్స్ లో, హిస్టరీ లో, మాథ్స్ లో ట్రై చేశాడు . ఒకరు చాక్ పీస్ విసిరితే మరొకరు డస్టర్ విసిరారు . మాథ్స్ సర్ ఇంపో జిషన్ ఇచ్చారు. మధు పెదవి విరిచాడు . సోషల్ మేడం లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు . ఏ రోజూ క్లాస్ మిస్ అయ్యేవాడు కాదు. లంచ్ తరవాత మొదటి క్లాసు అదే కాబట్టి గబగబా ఇంట్లో నాలుగు పెరుగన్నం ముద్దలు తిని ఎండలో చెమటలు కక్కుకుంటూ  బెల్లు కొట్టక ముందే స్కూలు కి చేరుకునేవాడు . ఆవిడ పూర్వ జన్మలో దేవతలకు జోల పాట పాడేదేమో ! అటు వంటి ప్రజ్ఞా శీలి క్లాస్ లో కూర్చోగలిగినందుకు తను ధన్య జీవి! పది తలల రావణాసురుణ్ణి అయినా ఒకే ఒక పారా గ్రాఫ్ లెసన్ చెప్పి నిద్ర పుచ్చగలదని  మధు తొడ గొట్టి చెప్తాడు .


*      *        *
ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా నిద్రా దేవత కు అధీనులే అని ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ,    ఆం .ప్ర . వాళ్లకి తెలీదా అని తిట్టుకున్నాడు మధు. పరీక్ష ముందు రోజు నిద్ర మానేసి మరీ చదవాల్సినంత పోర్షన్ ఎందుకు పెట్టాలసలు? పెడితిరి పో . పరీక్షలెందుకు పెట్టాలి? సరే పెడితిరి పో . కరెక్ట్ గా ఈ టైం లోనే నిద్ర
తెరలు తెరలు గా పొరలు పొరలు గా అలలు అలలు గా ఎందుకు రావలె? సరే వచ్చింది పో . ఎక్కడికీ పో? నిద్ర లోకా? ఇంక పరీక్ష గల్లంతే!

“పరీక్ష ముందు రోజు అంటున్నావ్,ఒక రోజు గ్యాప్ ఉంటుంది గా , అప్పుడేం చేశావ్ ? “  అడిగింది
ధుమ . (ఇది మధు అంతరాత్మ . ఎడ్డెమంటే తెడ్డెం )

“అప్పుడు సోషల్ లెసనే పదే పదే గుర్తొచ్చేది . అరచేత్తో మండే సూర్యుణ్ణి ఆపలేనట్టు కళ్ళు తెరచి  సోషల్ లెసన్ ఎఫెక్ట్ ఆపలేం . మెదడు లో తిష్ట  వేసుకున్న ఈ వైరస్ ని క్వారంటైన్ చెయ్యలేం . లొంగి పోవడం తప్ప మార్గం లేదు సోదరా!విధి ఆడే ఈ వింత నాటకంలో నేను ఒక పావుని . బలి పశువు ని ! హా ....... “

“మరి సంవత్సరమంతా ఏం చేసావ్ చదవకుండా?గాడిదలు కాశావా ?”

“కాలేజీ నుండి ఇంటికి,ఇంటి నుండి కాలేజీ కి షటిల్ కాక్ లా ఎగరడంతోనే  సగం రోజు గడిచేది . కాలేజీ లో పాఠాలు చెప్పటమే గాని చదవటానికి టై మెప్పుడిచ్చారు ?”

“ఇస్తే మీరు గ్రౌండ్లో క్రికెట్ ఆడేవాళ్ళు కదా,నేనూ కీపింగ్ చేశాగా కొన్నాళ్ళు !”

“అదే తప్పు ! మమ్మల్ని మేం మెలకువగా ఉంచుకోవటం కోసం అటూ ఇటూ పరిగె త్తేవాళ్ళం , పిచ్చి బంతి ఆడేవాళ్ళం . రాత్రి కి ఇంటికెళ్ళి టీవీ చూసి అమ్మ పెట్టే నాలుగూ తిని పడుకునే వాళ్ళం . తెల్లారి బస్సె ళ్లి పోతుందనే కేకలతో సుప్రభాతం పెట్టేది అమ్మ . చదువుకు ఛావటం రాదు,వేలకు వేలు ఫీజులు పోస్తున్నాం అని తలంటి పోసే వారు నాన్న . అంతా రొటీన్ . డల్ . ఇలాంటి గ్రే లైఫ్ లో కలర్ ఫుల్ డ్రీమ్స్ కోసం,ఒక చిన్న కునుకు కోసం ఎంత పరితపించే వాడినో నీకేం తెలుసు? ఆవలింతలకు చిటికేసి రమ్మనే ఆ మధువు ను ఏ కారణంతో కాదనాలి?అందుకే నేను దాసోహమన్నాను . ఆనందం కోసం అనుక్షణం వెంపర్లాడే ఈ మానవులు అది నిద్ర లో ఉందని తెలుసుకోలేని అమాయకులు . నా ప్రియాతి ప్రియమైన నిదురమ్మను  వదిలి పెట్టమని చెప్పే ఈ పరీక్షలకు నేను లోక బహిష్కార శిక్ష విధిస్తున్నాను ! ఇదే నా తీర్పు!”

మధు స్పీచ్ కి ధుమ అంతర్ధానమైంది .

--మోహిత


No comments:

Post a Comment