Sunday 31 March 2013

పరిష్కారం


పరిష్కారం

ఒకానొకప్పుడు నేను అచ్చం యద్దనపూడి నవల్లో హీరోయిన్లా జుట్టు వెనక్కి దువ్వి ముడి వేసి ,నుదుట చిన్న బొట్టూ,కళ్ళకి పెద్ద ఫ్రేము జోడూ, కుడి చేతికి వాచీ తగిలించి రివాల్వింగ్ చైర్ లో కాలు మీద కాలు వేసుకొని నా
పనమ్మాయి పోస్టు కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తున్నాను . ఇటీవలే సంపాదించిన యు ఎస్ కంపెనీ లో
ఉద్యోగం, ఎప్పుడు పడితే అప్పుడుండే షిఫ్ట్ , రెండు చేతులా ఉండే డబ్బులు, ఫ్లాట్ లో ఒంటరి జీవితం. అందుకే పనమ్మాయి కావల్సొచ్చింది . ఊ చాలా  హెవీ కాంపిటీషన్ ఉంది . ప్రతి వాళ్ళూ వాళ్ళ టైం కి నన్నుఅడ్జస్ట్ అవ్వమంటున్నారు.మేం ముప్ఫై మూడు ఇళ్ళల్లో చేస్తాం కాబట్టి మీ నెంబర్ ముప్ఫై నాలుగు కాబట్టి మేం వచ్చి నప్పుడే మీకు పండుగ ‘ వంటి కవరింగ్ లెటర్స్ పెట్టారు . లాభం లేదు,నేను ఏదో ఒక మెయిడ్ సర్వీసెస్ ఏజెన్సీ ని
వెతుక్కోవలసిందే అని డిసైడ్ అయ్యి కుర్చీ లోంచి లేచాను. అప్పుడు నా ఒళ్ళో నుంచి ఒక తెరవని కవర్ కింద పడింది . తెరిచాను. “అక్కా “ అంటూ మొదలుపెట్టి ,తను మా ఇంటి ఎదురుగా ఉన్న చర్చి పక్కనే ఉంటుందనీ , నా షిఫ్ట్ ప్రకారం తన టైమింగ్స్ అడ్జస్ట్ చేసుకుంటాననీ రాసింది. వెతకబోయిన పనమ్మాయి ఇంతసేపూ నా ఒళ్ళోనే  ఉందని జ్ఞానోదయం అయింది. వెంటనే  “చెల్లీ” అంటూ మొదలు పెట్టి “ రెక్కలు కట్టుకు వచ్చి వాలు,పది రోజుల బట్టలు కంపు కొడుతున్నా”యని అపా యింట్ మెంట్ ఆర్డర్ రాసి దాన్ని రాకెట్ లా చేసి మా బాల్కనీ లోంచి వాళ్ళ ఇంట్లోకి విసిరేశాను.

ఐదు నిమిషాల్లో నా కాలింగ్ బెల్ మోగింది. ఈమేనా సుజాత ? 35 ఏళ్ళు ఉంటాయి . మరి నన్ను అక్క? గౌరవ వాచకం కాబోలు! గౌరవ మీటర్లో సుజాత లెవెల్ అమాంతం పెరిగి పోయింది. మరో ఇరవై నిమిషాల్లో బట్టలన్నీ మల్లెపూల సర్ఫ్ వాసనతో శుభ్రంగా బొక్కెన లో ఉన్నాయి . పొట్టిగా ఉన్నాను కదా దండెం అందదు కాబట్టి నువ్వే ఆరేసుకో అంది. సింక్ లో గిన్నెలు 5 నిమిషాల్లో నిమ్మ సువాసన తో తళతళ. ఇల్లు లైజోల్ పరిమళం తో అద్దంలా మిలమిల. జాయిన్ అయిన రోజు నుంచే జీతం డబల్ చేశాను !
*****

అన్నం తినే వాళ్ళని చూశాను. చపాతీలు తినే వాళ్ళని చూశాను. నూడుల్స్ తినే వాళ్ళని కూడా చూశాను. గడ్డి తినే వాళ్ళనీ చూశాను. కానీ ఇదేంటండీ సుజాత సబ్బు తింటుంది?

ఎంత లావు సబ్బు ఇచ్చినా సరే 3 రోజుల్లో అరగ్గొ ట్టేస్తుంది. ఎందుకు అంత సబ్బు పెడతావ్ అంటే మురికి పోవాలి కదా అంటుంది. ఏం మురికి నా మొహం? నేనేమన్నా చిన్న పిల్లనా బట్టలు మురికి చేసుకోవటానికి? చెమట వాసనా? 200 రూపాయల డియో వాడతానే! అంట్లు కూడా అంతే. విమ్ బార్ పది రూపాయలది నాలుగు రోజులు వస్తే గొప్పే ! ఉండేది
నేను ఒక్కదాన్ని. మహా అయితే రోజుకి ఒక జత బట్టలు, మూడు నాలుగు గిన్నెలు తప్ప ఉండవు. వాటికి ఇంత సబ్బా?
వాంమ్మో వాంమ్మో నా జీతం మొత్తాన్ని సబ్బు తో ఉతికి ఆరేస్తోంది సుజాత! చివరికి చెర్లపల్లి జైలు సబ్బు కూడా పది రోజుల్లో అరగదీసింది!

*****
స్టేటస్ కోసం సుజాత ని పెట్టుకోలేదు. అపార్ట్మెంట్ బతుకుల్లో ఎవరితో ఎవరికీ సంబంధం లేని లైఫుల్లో ఏది పగలో ఏది రాత్రో తెలియని ఉద్యోగాల్లో నాకు సోషలైజేషన్ అవసరం అనిపించింది.2 తెలుగు,ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు తెప్పించినా
నాకు వాటి వంక కూడా చూసే టైం ఉండదు. సుజాత వచ్చినప్పుడల్లా పనయ్యాక తీరిగ్గా కూర్చొని వాటిని చదివి నాకు ముఖ్యాంశాలు చెబుతూ ఉంటుంది. కంప్యూటర్ మీద పని చేసుకుంటూనే ఊ కొడతాను.  నా పాలిటి పెద్ద న్యూస్ పేపర్ సుజాతే. చట్టు పక్కల ఎవరికి డెలివరీ అయిందో,ఎవరికి అమెరికా ట్రాన్స్ఫర్ అయిందో , ఎవరింట్లో నీళ్ళు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నారో,సందులో పిచ్చి కుక్క ఎవర్ని కరిచిందో ఇలాంటి వన్నీ ఏకరువు పెడుతుంది.నాకు కుడా చుట్టూ ఉన్న ఇండియన్ ప్రపంచం తో సంబంధం ఉందనిపిస్తుంది.  రెండు కనకాంబరం మొక్కలు, ఒక సన్నజాజి మొక్కా తెచ్చి
ఇచ్చింది. డ్వాక్రా లో ఏవో పనులు చేస్తుంది. సండే చర్చి కి వెళ్తుంది. భర్తకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చిన్న ఉద్యోగం. దానికి చన్నీళ్ళ సాయం తన జీతం . పిల్లలిద్దరినీ ఇంటి దగ్గరే ఉన్న సంక్షేమ హాస్టల్ లో పడేసింది. ఇంట్లో ఏమీ తోచక నా దగ్గర పని చేస్తుంది.క్రిస్మస్  కి చీర పెడితే మురిసి పోతుంది. మీరనుకోవచ్చు తనకి ఏ కష్టాలూ లేవేమోనని. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది కాబట్టి నేనూ  అంతే అనుకుంటాను.
*****
ఒక రోజు సుజాత పనికి వచ్చినప్పుడు యుటిలిటీ లో కుళాయి తిప్పకుండానే నీళ్ళు పోతున్న సౌండ్ వస్తే ఏంటా అని చూస్తే నోట్లో చెంగు కుక్కుకొని ఏడుస్తోంది. హమ్మయ్య ఇన్నాళ్ళకి చిక్కింది అని నాలోని సాడిస్ట్ నవ్వుకొని పైకి మాత్రం
“ఏమైంది సుజాతా?” అని ఓదార్పుగా అడిగాను. తీగ మీద ఆరేసిన పట్టు చీరని చూపించింది. “నాదే! రాత్రి పెళ్లి కి వెళ్లాను. రాగానే ఉతికేశాను”,అన్నాను. ఏడుపు ఇంకా పెద్దదైపోయింది. అలాంటి చీర నాకు పెట్టు అంటుందేమో అనుకున్నాను. “నువ్వు సంగతేంటో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా?” అన్నాను చిరాకుగా. “అక్కా,నేనుండగా నీ చీర నువ్వే ఎందుకు ఉతుక్కున్నావు” అని రాగం పెంచేసింది! ఈ నిస్వార్థ మూర్తినా నేను అపార్థం చేసుకుంది అని తిట్టుకొని “కాదు ఇది పట్టు చీర కదా, సబ్బుతో ఉతకరు. కుంకుడురసం లో నానబెట్టి జాడించేశా.ఎక్కువ కష్టం లేదులే “ అని
ఓదార్చాను.ఈ ఖరీదైన చీర సజాత చేతుల్లో పెడితే ఇంకేమన్నా ఉందా?!!!
చెల్లి తో అంతా బానే ఉంది. ఈ సబ్బే ఏం బాలేదు. దీనికి పరిష్కారం కోసం నా సాఫ్ట్ వేర్ బుర్రని తొలుస్తున్నాను.

*****
చివరాఖరికి ఒక అవిడియా వచ్చింది. మార్కెట్ లో కి కొత్తగా వచ్చిందని ఒక ఎర్ర సబ్బు ఇచ్చాను. డిటర్జెంట్ లో నాన బెట్టాక దీంతో ఒక్కసారి రుద్దితే చాలు అని చెప్పాను. “ఇదేంటక్కా ఎంత రుద్దినా నురుగు రాదు” అంటూనే దాన్ని అరగ్గొట్ట లేక ఆయాస పడుతూ అడిగింది. కొత్త రకం అనేసి ఊరుకున్నాను. తనకి ఇటుక రాయి ముక్క ఇచ్చానని మీరు కూడా చెప్పకండే !!!

-మోహిత


1 comment:

  1. మా ఇంట్లో కూడా ఇలాగే ఒకమ్మాయి చేస్తుంది. మా అమ్మ/నాన్నగార్లు అమెరికా వచ్చినపుడు మళ్ళీ తిరిగి వెళ్ళాక వెతుక్కోలేము అని ఇక్కడ ఉన్నన్నాళ్ళూ జీతం యధావిధి గా ఇచ్చి ఉంచుకున్నారు. కాని, విశ్వాసం నిలబెట్టుకుంది. ఈ మధ్య బాంక్ లో ఉద్యోగం వచ్చినా కూడా మా ఇల్లు వదలకుండా చేస్తూంది అని మా అమ్మ ముచ్చట పడుతూ ఉంటారు. కాని, టైమింగులే తెగ మార్చేసింది. తెల్లారకుండా వస్తుంది లేకపోతె రాత్రెప్పుడో వస్తుంది అని కంప్లైంటు :) - ఈ మాత్రం చేసేవాళ్ళు దొరకకే కదా - అని సర్దిచెబుతూ ఉంటాము!!

    ReplyDelete