Sunday 31 March 2013

సూపర్ ఆఫర్


సూపర్ ఆఫర్
“హలో “ అమ్మాయి గొంతు
“హలో “ అబ్బాయి గొంతు
“హలో ఓ ఓ ఓ ఓ “
“హలో ఒ ఒ ఓ ఓ “
“హాలో ల్లో లలో “
“హహ హ లో లో “
ఈ విధంగా పదహారు రాగాల్లో హలో చెప్పుకున్నాక అమ్మాయి కి విసుగొచ్చింది.
“ఎహె నీ , హలో తప్ప ఏం  రాదా ?”
“ఇంకా చాలా వచ్చు బేబీ. ముందు నువ్వు ఓకే అనాలిగా”
“నేను అనటం కాదు. అనేలా చెయ్యాలి.”
“సర్లే, తిన్నావా ?”
“యా “
“ఏం కూర ?”
“టమాటో “
“నీకు టమాటో అంటే చాలా ఇష్టం కదూ ?”
“అరె, అంత కరెక్ట్ గా ఎలా చెప్పగాలిగావ్ ?”
“సిక్స్త్ సెన్స్ “ కాలర్ ఎగరేశాడు అబ్బాయి .
ఏడ్చావ్ , మంచి బకరా దొరికాడనుకుంది అమ్మాయి.
“ఇంకా”
“నువ్వే చెప్పాలి “
“ఎ బి సి డి  చూశావా “
“యా , ప్రభుదేవా అదరగొట్టాడు కదా “
“అలా నువ్వెప్పుడు అదర గొడతావ్ “
హుం ఈ అమ్మాయిలు ఎప్పుడూ ఇంతే!అబ్బాయిలంతా హీరోలవ్వలేరు అన్న చిన్న విషయం కూడా గ్రహించుకోరు!
“నేనూ అలా దిమ్మ తిరిగేలా డాన్స్ చేస్తే  పాపం ప్రభుదేవాని ఎవరు చూస్తారు ?”
“నీకు రాదని ఒప్పుకోవచ్చుగా “
“సర్లే ఇంకా ?”
“రేపు షాపింగ్ కి వెళ్తున్నా. తోడొస్తావా ?”
“రేపూ ..... నేను చాలా బిజీ “
“నా బర్త్ డే కి సూపర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. పార్టీ లో నేను షైన్ అవ్వాలి కదా !”
“హే , బర్త్ డే పార్టీ నా ఎప్పుడు ?మరి నన్ను ఇన్వైట్ చెయ్యవా ?”
ఈ అబ్బాయిలింతే. గర్ల్స్ కోసం పైసా ఖర్చు పెట్టాలన్నా ఏడుస్తారు - నిట్టూర్చింది అమ్మాయి.
“ఇన్వైట్ చేస్తాలే గాని గిఫ్ట్ ఏమిస్తావ్ ?”
“డార్లింగ్ , నాకన్నా పెద్ద గిఫ్ట్ ఏంకావాలి ?”
పిసిని గొట్టు వెధవ !
హమ్మా నన్ను బుట్టలో వెయ్యటం అంత తేలిక కాదు!
“ఛా ! మొన్న అబిడ్స్ లో మామిడి పిందె షేప్ ఇయర్ రింగ్స్ చూశాను. ఎంత బావున్నాయో “
ఒసే నీ ఆశకు అంతు లేదా ?
“చంద్ర బింబం లాంటి నీ ముఖానికి, నక్షత్రాల్లా మెరిసే నీ కళ్ళకి మామిడి పిందెలు సూట్ కావు “
ఒరేయ్ పొగిడితే పడిపోతానను కుంటున్నావా?
“ఏంటి కవిత్వం మొదలెట్టావ్ ?”
“నీతో మాట్లాడుతుంటే ఎమోషన్స్ అలా పొంగుతున్నాయ్ “
“బోర్ కొట్టించకు “
“సరే,ఇంకేంటి?”
“డిన్నర్ అయిందా ?”
“యా! ఇప్పుడే గ్యాంగ్ అంతా కలిసి బీర్లు కూడా కొట్టాం!”
తాగి తూల్తున్నావా నాయనా ?
“బాగా అలవాటా ?”
“హే, హాబీ ఏం కాదు, ఫ్రెండ్ కి జాబొస్తే పార్టీ ఇచ్చాడు. వాడు బలవంతం చేస్తే కాదనలేను”
ఫ్రీ గా వస్తే ఎందుకు కాదంటావ్రా ఆశ పోతు రాస్కెల్ !
నీ లా తండ్రి సంపాదన అంతా ఇయర్ రింగ్స్ కొని సద్వినియోగ పరచటం మాకు రాదమ్మా, పార్టీలు ఇవ్వడమే తెలుసు.
“డ్రింక్ చేస్తే కిక్కొ స్తుందా , బూతులు తిడతారా?”
ఏంటే , కవిత్వం చెప్తే బోరా ?బీర్ బోర్ కాదా.
“అవున్రా, చాలా బాగుంటుంది. నువ్వు టేస్ట్ చేశావా ?”
ఏంటి నన్ను ‘రా’ అంటున్నాడు ? ఎక్కువ ‘రా’ తాగేశాడేమో
గొంతు కొంచెం హస్కీ గా మార్చి “ఒరేయ్ “ అంటే అమ్మాయిలు ఠపీ మని బుట్టలో పడిపోతారు
“యాక్, ఆ స్మెల్ , ఆ టేస్ట్ అసలు ఎలా తాగ గలుగుతారో”
“ఒకసారి తాగి చూడు తెలుస్తుంది. అయినా బీర్ కి ఏం కాదు”

అర్థం పర్థం లేని ఈ సంభాషణ మరో రెండు గంటలు సాగింది. అది సెన్సార్ చెయ్యాల్సిన రేంజ్ లో ఉంది కాబట్టి ఇక్కడ చెప్పలేకపోతున్నాను. అబ్బాయి టెర్రస్ మీద సిమెంట్ దిమ్మెల లో ఒకదానికి ఆనుకొని కూర్చొని మాట్లాడుతున్నాడు. అమ్మాయి రూం లో లైట్ ఆఫ్ చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సున్నా డెసిబెల్స్ వాల్యూం లో మాట్లాడుతోంది. వారి వారి రెస్పెక్టివ్ పేరెంట్స్ కి తెలీకుండా ఇద్దరూ ఫోనులో ఛార్జింగ్ అయిపోయేవరకూ మాట్లాడుకున్నారు.
చివరికి అమ్మాయి
“హే, నా దాంట్లో ఛార్జింగ్ లేదు యార్! చార్జర్ డాడీ దగ్గరుంది. రేపు నైట్ ఇదే టైం కి  ఫోన్ చెయ్ “
మళ్ళీ వీడితోనే మాటలాడకుండా  రేపు వేరే రాంగ్ నెంబర్ తగిల్తే బాగుండు!
“ష్యూర్  డార్లింగ్! నువ్వు ఫ్రీ అయినప్పుడు మిస్డ్ కాల్ ఇవ్వు. ఉమ్ మ్ మ్... మ్మా! బై !గుడ్ నైట్! స్వీట్ డ్రీమ్స్ !టేక్ కేర్ “
రేపు కూడా నీకే చెయ్యాలానే ?మరో నెంబర్ కి డయల్ చేస్తా!నీలాంటి ఎంకరేజింగ్ పోరి తగిల్తే లక్. లేకపోతే నీకే చేస్తా. మంచి టైం పాస్.

ఫ్రీ టాక్ టైం పేరుతో మొబైల్ ఫోన్ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లను ఇవ్విధంబున క్రియేటివ్ గా, రి క్రియేటివ్ గా ఉపయోగించుకున్నందుకు మన యువత కు అభినందనలు తెలియజేస్తున్నాం.
ఇప్పుడు సీరియస్ :
మొబైల్ ఫోన్  కంపెనీలు రేట్లు పెంచేసి, ఫ్రీ టాక్ టైం కోసేసి మన యువతను ఇలా రాంగ్ నంబర్ల చెత్త కాల్స్ నుండి రక్షిస్తున్నాయని చెప్పుటకు మిక్కిలి సంతోషించుచున్నాను.

--మోహిత  


2 comments:

  1. బాగుంది మోహిత గారు. మీ బ్లాగు ని కూడలి లో కలిపారా? (www.koodali.org)

    ReplyDelete
    Replies
    1. కూడలి లో కలిపాను ఇవాళే !

      Delete