Thursday 16 July 2020

కృష్ణశోధ (కొత్త కథ 2017 కోసం ) 04 ఫిబ్రవరి 2017

కృష్ణశోధ

(కొత్త కథ 2017 కోసం )

“కృష్ణా ! నీవు నన్నెంత బ్రతిమాలినను కాళిందీ తీరమునకు రాను. రాను గాక రాను. ఈ నిశీథ సమయంబునట! నేనట! తన తోడి రావలెనట. ఇదెట్లు పొసగును?”

***
గంగ పారినట్లు కదలి పోయెడి దాన 
ప్రేమ తృష్ణ నెండి వేగియున్న 
నా వలపు తలపుల నారుమడి తడుప 
వేగ తరలి రావె ప్రేమ గంగ !

***
వెనుదిరిగి కృష్ణుడు తన వెనుక గాని, ప్రక్కల గాని లేకుండుట గమనించి ఇంచుక ఆశ్చర్యముగ - “ఏడీ వెన్నదొంగ! ఆహా! తెలిసినదిలే నీ దొంగాట! ఎందుబోయెదవుగాక !”

అదె నంద నందనుండతర్హితుండయ్యె ... 

“ఇచ్చటెచ్చటను లేడే ఏమయి ఉండును ? ఇంతవరకు మాతో సరస సల్లాపము లాడుచుండి ఇంతలో అదృశ్యమయి ఆ మాయవాడు ఎక్కడ దాగినాడమ్మా?”

***
మనసు తెలిపియుండ మనువాడ రమ్మంటి 
తెగువతనము లేదె మగువ నీకు !
వలపు తెలిపియుండ నను చేర రమ్మంటి !
భంగపాటె  పాడి సఖియ నీకు !

***
“ఈ వృక్షజాతులనడిగి చూచెదను గాక! ఓ వృక్షములార ! ఓ పొదలార ! ఓ లతలార ! మా వేణుగోపాలుడిని మీరెవరైన చూచితిరా?
పున్నాగ కానవే 
లేదా! చూడనే లేదా !
ఘనసార కానవే 
లేదా! కనిపించనే లేదా !
మన్మథ కానవే 
లేదా! రానే లేదా !
ఇంచుక కోపము, విచారము లభినయించి “ఏమీ! అసలు కృష్ణుడనేవాడు ఎలా ఉంటాడో మీకు తెలియనే తెలియదా? ఏవి చోద్యమమ్మా !”

***
నీ పిలుపు మొన్నటి నీ అధర పానంలా మహా చప్పగా ఉన్నది. తిట్టుకొనవద్దన్నావు గనుక నిన్ను ఏడిపించటం నాకు మహా సబబు !

***
మా కృష్ణుడు నల్లనివాడు. అహ ! పద్మనయనమ్ములవాడు ! ఉహుఁ కృపారసంబు పై జల్లెడివాడు ! ఇంకను చెప్పుదునా? మౌళి పరిసర్పిత పింఛమువాడు గుర్తు వచ్చెనా ! నవ్వు రాజిల్లెడి మోమువాడతడు ! తెలిసెను కదా !

***
ఏడకొస్తివే - పిల్లా 
ఎప్పుడొస్తివే !
ఎప్పుడొస్తివే - పిల్లా 
నీవేడకొస్తివే ?
కఱ చేబట్టి - నిను 
గడ్డికి రమ్మంటే 
మాగాణి చేనికి 
మఱి రమ్మంటే -
ఏడకొస్తివే - పిల్లా 
ఎప్పుడొస్తివే !

***
“ఏమీ మీ వైపు రాలేదా ? ఓ పొగడలార ! ఓ లవంగలార ! ఓ నారంగములార ! ఓ మల్లియలార ! మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే ! లేదు ? రాలేదు ? రానే లేదు ? ప్రతి రోజు బృందావనములో మీ కనుల ఎదుల మసలుచుండిన కృష్ణుని మీరు చూడనే లేదనుచున్నారా ! ఎంతటి కఠినాత్మలే మీరలు ! మిమ్ము పేరుపేరున అడుగుట కంటె నాకై నేను వెదకి కొనుటయె మంచిది.”

***
ఓర పొద్దు గ్రుంకి నాక 
ఊరు మాటు మణిగే వేళ 
తమలపాకు తోటలోకి 
తప్పకుండా రమ్మంటే 
సడీ సప్డు సేయకుండ 
సల్లగానె జారి పోత్వి 

***
వెదకుటనభినయించి ఒక పూలత చెంతకు చేరి సంభ్రమముచే “ఓ సుభాషిణీ! ఓ మయూరీ! పద్మాక్షీ! రండి! ఇటు రండి! చూచారటే ! కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ - ఔనే మన కృష్ణుడేనే ! యొనసి పాదాగ్రంబు మోపినాడు - చూడవే ! ఈ తడి గుర్తులు చూడవే ! ఔనే ! ఎవరితోనో ఈ మడుగు చొచ్చినాడు కాదటే ?”

***
నేనేదో సముదాయింపు కోసం నిన్నాశ్రయిస్తే నువ్వు కూడా సముదాయించమంటున్నావు? ఎటు చూసినా సమస్యలు ! సమస్యలు ! ఒకరు తొందరపడినపుడు రెండవవారికి ఆలస్యమవుతుంది. రెండవవారు తొందరపడినపుడు మొదటివారికి ఆలస్యమవుతుంది. 
***
“ఏమే ఇటు రండి ! ఈ నాలుగు పాదమ్ముల గుర్తులెవ్వరివై ఉండునో !” 
రెండు పాద చిహ్నములు తాకుట నభినయించి “ఈ రెండు మాత్రము కృష్ణుడివే ! ఆహాఁ తెలిసిందిలే. ఒక యెలనాఁగ చేయూది నాడిక్కడ - అందుకే. ఈ అడుగులేమిటే ఎదురెదురుగా ఉన్నయ్ ! ఓహో ! ఒక యింతి కెదురుగా నొలసి నాడిక్కడ”

***
ఆదివారం దాకా ఆగమన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
సోమవారం దాకా సూడమన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
మంగళోరం దాకా మాటలొద్దన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
బుధవారం దాకే బాధ లెమ్మన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
గురువారం దాకే, గొడవెందుకన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
శుక్రవారం దాకే సీర సుట్టేత్తనన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
శనివారం దాకా ఆగనన్నావు గందే 
ఇవ్వాళ యే వారం ! ఏంటే నీ యవ్వారం !
ఏ వారమావారం ఏదో సెబుతుంటావు 
వచ్చేది యే వారం ? నచ్చదీ యవ్వారం !!

***
విచార మభినయించుచు ఇంచుక కోపముతో  “ఐనా కృష్ణా! తల్లిదండ్రుల ఆక్షేపణ సైతము లక్షింపక నీకై వచ్చినందులకా ఈ దొంగాట ! నన్నెందుకింత వంతల పాలు చేయుదువు! నీవెరుగవా కన్నయ్యా ?”
ఆదివారం గదాని అనుకొన్నాను 
ఆకు తీసుకొని సున్నం రాస్తుండిపోయాను 
సోమవారం గదాని అనుకొన్నాను
సోకు సేసుకుంటా కూకుండిపోయాను 
మంగళోరం గదాని అనుకొన్నాను
ముదనష్టపు సిగ్గోటి ముంచెత్తింది 
బుధవారం గదాని అనుకొన్నాను
బుంగ చేతబట్టి నే నీళ్ళ కెళ్ళాను 
గురువారం గదాని అనుకొన్నాను
గడపకు పసుపు రాసి మరుమల్లె చెండాను 
సుక్కురారం గదాని అనుకొన్నాను
సక్కిలాలు వండుతు మిన్నకున్నాను 
శనివారం గదాని అనుకొన్నాను
దనియాలు దంచుతు నేనుండిపోయాను 
ఏనాటి కానాడు ఏదేదొ యెందుకు 
వచ్చేదే మధుమాసం నీ కోసరం నా కోసరం 

***
జడివాన కురిపించు జలదమా 
ఈ వేళ నా చెలి కరుణించి నన్ను చేరె 
చలిగాలి తరలించు చంద్రుడా 
ఈ నాడు నా సఖి మన్నించి నన్ను కోరె 

***
“కృష్ణా! ఈ దారుణ విరహార్తి నేనెట్లోర్తునయ్యా !” అత్యంత బాధ నభినయించుచు కన్నీరు కార్చసాగెను.  

***
నాకు నీవే ఎప్పటికీ గురువువి. నా మనసును పూర్తిగా ఆక్రమించుకొనిన మహోన్నతమైన స్త్రీ మూర్తివి నీవు. ఆజన్మాంతం ఆచంద్రతారార్కం నీ, నా బంధం బిగింపబడాలని నా విపరీతమైన కోరిక. 

***
మార్తాండుడుగ్రుడై మల మల మాడ్చెడి 
వేసవి చలిగాలి వీచినట్లు 
చంద్రుండు క్రుద్ధుడై చర చర వ్రేల్చెడి 
వెన్నెల వేడిమి వీడినట్లు 
కృష్ణుండు దాగనై గిల గిల నేడ్చెడి 
రాధకు మన్మథు తూటుల మాపెనట్లు !

***
ఆలస్యమైతేనేం, అమృతం అయినపుడు !

  • మోహిత కౌండిన్య 
4 ఫిబ్రవరి 2017
కన్యాకుమారి 

No comments:

Post a Comment